Andhra Pradesh Elections 2024: తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు తిరుపతి (Tirupati)పై ఉంది. ఇదే వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) అని ప్రకటన రావడం ఓ కారణంగా చెప్పవచ్చు. గతంలో దొంగ ఓట్లలంటూ అధికారులు సస్పెండ్ నుంచి వివిధ రకాల అంశాలు తిరుపతి వైపు చూసేలా చేసాయి. ఈ క్రమంలో తిరుపతి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎటు వైపు అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
ప్రత్యేక హోదా అంటూ కాంగ్రెస్ ప్రచారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సంవత్సరాల పాటు తిరుపతి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కొందరు టీడీపీ... మరికొందరు వైసీపీకి వలసలు వెళ్లిపోగా, మిగిలిన కొందరు పార్టీ కోసం తమ ఉనికి కోల్పోతున్న సమయంలోనూ, ఇన్ని సంవత్సరాలుగా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ లోకి వైఎస్ షర్మిల రంగప్రవేశంతో పార్టీ కేడర్ లో నూతన ఉత్సాహం వచ్చింది. నూతన నియామకాలతో పాటు కొందరు నాయకులు రోడ్డు పైకి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నినాదంతో ముందుకెళ్తున్నారు. గత నెలలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ మోసం చేసిన బీజేపీ పై అదే వేదిక మీద నుంచి వైఎస్ షర్మిల తనదైన శైలిలో ప్రశ్నలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఏపీకి అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉండటంతో యువత సైతం హస్తం పార్టీ వైపు ఆకర్షితులు కావడం లేదు.


సీట్లపై సీనియర్ నాయకుల ఆశలు
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత 10 సంవత్సరాలుగా కొందరు నాయకులు ఉన్నారు. పార్టీ ఉత్సాహంగా ముందుకెళ్తుంది అనుకుని తమకే సీటు అని అన్నింటిని తానై నడిపించారు. అందులోని కొందరు నాయకులు సీట్ల కోసం ఆశించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ వారు కమ్యూనిస్టులకు కేటాయిస్తున్నారు.  వైసీపీ నుంచి సైతం సీట్లు రాని వారు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో రెండు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీటు వచ్చే అవకాశం లేదు. దీంతో పార్టీలో కొంత అసంతృప్తి నెలకొంది.


తిరుపతి ఎంపీ సీటుపై ఆశలు 
తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఒక్కరు. ఆయన గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయనకే ఎంపీ సీటు అంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో ఆయనకు సీటు దక్కకపోవడంతో ఢిల్లీలో తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు చేస్తున్నారు. చింతామోహన్ కుమార్తె డాక్టర్ నీనాకు గూడూరు ఎమ్మెల్యే సీటు కోసం కూడా ప్రయత్నం చేస్తుండగా అది కూడా వచ్చేలా కనిపించడం లేదు.


కమ్యూనిస్టులకి తిరుపతి సీటు
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తిరుపతి లో పోటీ చేస్తూ వస్తోంది. ఈసారి తిరుపతి ఎమ్మెల్యే సీటు కమ్యూనిస్టులకు కేటాయించారు. శనివారం అభ్యర్ది ప్రకటన సైతం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ సీటు ఎవరికి ఇస్తారో తెలియడం లేదు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తిరుపతి నుండి ఎంపీ పోటీ కాంగ్రెస్ అని ప్రకటన చేసినా అభ్యర్థి ఇంకా ఎవరనేది స్పష్టత రావడం లేదు. పార్టీ నాయకులు మాత్రం తమకు సీటు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.