ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్రను తప్పుబట్టారు. అది శవయాత్రలాగా ఉందని ఎద్దేవా చేశారు. తిరుమల స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నారాయణ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించా. పాదయాత్ర అంటే ఒక పటుత్వం ఉండాలి.  ఎడారి యాత్రగా తీసుకుని మేము వేసిన రోడ్లపై నడుస్తూ ఏం అభివృద్ధి కాలేదని విమర్శించడం సరైన విధానం కాదు.  సైకో కు సంబంధించిన పాదయాత్రగా కనిపిస్తుందే గానీ ప్రజల సమస్యలు తెలుసుకునే పాదయాత్ర కాదు. చంద్రబాబు నేను మారాను అని చెప్తాడు. మ్యానిఫెస్టో పెడుతాను అంటాడు.  మ్యానిఫెస్టో పెట్టి నేను మహిళా లోన్ లు ఎత్తి వేసానంటాడు, ఇండ్లు ఇచ్చానని, అభివృద్ధి చేసానంటాడు.  ఔరంగాజేబు మనస్తత్వం కలిగి వ్యక్తి చంద్రబాబు నాయుడు.  పాదయాత్రలో శిలాఫలకం కొట్టుకుంటూ పోతూ ఒక‌ సర్పంచ్, జెడ్పిటీసీ‌, ప్రజల్లో‌ పలుకుబడి ఉన్న వ్యక్తి కాదు లోకేష్.  లోకేష్ పాదయాత్ర శవయాత్రగా కనిపిస్తోంది.


ప్రస్తుతం చంద్రగిరిలో యువగళం పాదయాత్ర


నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 30వ రోజు చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.


ఫ్లెక్సీల తొలగింపు


నారా లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఎందుకని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించగా ఎన్నికల కోడ్ ఉందని ఫ్లెక్సీలు తొలగించామని అధికారులు చెబుతున్నారు. యువగళం ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకపోతే బతకలేమని నారా లోకేష్ పేర్కొన్నారు. నేడు యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన రజకులతో ముఖాముఖి నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలు తగ్గేందుకు కేరళ తరహాలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు. బీసీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ దొంగ కేసులు పెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. తాము ప్రభుత్వంలోకి రాగానే జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినవారిని తొలగిస్తామని లోకేశ్ అన్నారు.