శ్రీవారి ఆలయంపై డ్రోన్స్ తిరుగుతుంటే భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. యాంటీ డ్రోన్ సిస్టంను టీటీడీ వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. డీఆర్డివో అధికారులతో ఏడాది క్రితం యాంటీ డ్రోన్ సిస్టంపై చర్చలు జరిపినా, దాని అమలులో జాప్యం అయిందని అన్నారు. వెంటనే డీఆర్డివో అధికారులతో చర్చ జరిపి టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి యాంటీ డ్రోన్ సిస్టం అమలు చేయాలని కోరారు. ఐఐటి నిపుణులు తెలిపిన విధంగా తిరుమలలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ విషయంలో అజాగ్రత్త వహిస్తే జోషిమట్ పరిస్థితి పునరావృతం అవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.


శ్రీశైలంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవినీతికి పాల్పడినట్లే తిరుమలలో కొందరు పాలకమండలి సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పీఏల ద్వారా సేవ టిక్కెట్లు, గదులను అధిక ధరకు విక్రయిస్తున్నారని భక్తుల వద్ద నుంచి ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కోరారు.


తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో వైరల్ అవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాల నిషేధం ఉంది. అయితే, శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఐకాన్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు మండిపడుతున్నారు.


కోట్లాది మంది ఆరాధ్య దైవం అయిన శ్రీనివాసుడి దర్శనార్థం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తిరుమల పుణ్య క్షేత్రానికి వస్తుంటారు.  అయితే, తిరుమల కట్టుదిట్టమైన భద్రత వలయాలతో పటిష్ఠమైన సెక్యూరిటీ కలిగిన దేవస్థానం. నిత్యం మాన్యువల్ సెక్యూరిటీ నుంచి మూడో కన్ను వరకు అన్ని కాపు కాస్తూనే ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హైసెక్యూరిటీ నడుమ టీటీడీ విజిలెన్స్, పోలీసు, ఆక్టోపస్ అంటూ వివిధ సెక్యూరిటీ ఫోర్స్ లతో పాటు సీసీ కెమెరాలు నిత్య పర్యవేక్షణలో తిరుమల సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి హైసెక్యూరిటీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ అనుమతి లేకుండా డ్రోన్స్ ఎగురవేస్తే కటకటాల పాలుకావాల్సిందే. ఇక ఇప్పటికే నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ కేంద్ర పౌర విమానయాన శాఖను పలుమార్లు కోరింది. అయితే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన పౌర విమానయాన శాఖ అధికారులు అది సాధ్యం కాదని తేల్చారు. విమానం సంగతి పక్కన బెట్టిన డ్రోన్స్ ఎగరేయరాదనే నిబంధనలు మాత్రం పటిష్టంగా అమలు చేస్తుంది టీటీడీ.


విచారణ చేపడతాం - వైవీ సుబ్బారెడ్డి
ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురం చిత్రీకరణకు అనుమతులు లేవని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరుపుతున్నామన్నారు. హైదరాబాద్ కు చెందిన వారు విజువల్స్ ని అప్లోడ్ చేసినట్లు గుర్తించామన్నారు. వీళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు.  స్టిల్ ఫొటోగ్రాఫర్ తీసిన వీడియోలుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కుట్ర కోణంలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారా అనే దిశగా కూడా విచారణ జరుపుతున్నామన్నారు. రెండు, మూడు రోజులలో వాస్తవాలను భక్తులు ముందు ఉంచుతామని సుబ్బారెడ్డి చెప్పారు.