Peddireddy Ramchdra Reddy In Hindupuram : అధికార పార్టీ అయినందున మళ్లీ గెలవబోతున్నామన్న కాన్ఫిడెన్స్ కారణంగాణ వైసీపీ(YSRCP)లో  సీట్ల కోసం పోటీ ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి(Peddireddy Ramchandra Reddy). లేపాక్షి(Lepakshi) మండలం మనెంపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. హిందూపురం(Hindupuram), కుప్పం(Kuppam)లో ఈసారి కచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారాయన. 


రెండు రోజులు అక్కడే


రెండురోజులుగా హిందూపురంలో పర్యటించి నాయకులకు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులతో మాట్లాడారు. అసంతృప్తులతో మాట్లాడి పార్టీ విజయం కోసం పని చేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు.


ఇద్దరూ మహిళలే


హిందూపురంలో ఎప్పుడు లేని విధంగా కొత్త వరవడిని తమ నాయకుడు జగన్ తీసుకొచ్చారని కితాబు ఇచ్చారు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు మహిళలను నిలపడం గతంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదన్నారు. ఇక్కడ ఇద్దరు మహిళలను పోటీలో పెట్టామని వారిని కచ్చితంగా గెలిపించుకుంటామన్నారు. 


బాలకృష్ణ వల్లే అభివృద్ది జరగలే


పోటీలో ఉన్న అభ్యర్థులతో గ్రామాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు పెద్దిరెడ్డి. ఎన్నికలలోపు చేయగలిగినది పూర్తి చేస్తామన్నారు. చేయలేనివి ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని ప్రజలకు చెబుతామన్నారు. తమ నాయకుడు బరోసా ఇచ్చారని... ఐదేళ్లలో పేదలకు న్యాయం చేయాలనే చూశామని వివరించారు. 99 శాతం అన్ని సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు. హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్యే లేకపోవడంతోనే అభివృద్ధి జరగలేదన్నారు పెద్దిరెడ్డి. గతంతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా స్థానిక ప్రజా ప్రతినిధులు గెలిచారని గుర్తు చేశారు. ఇక్కడ చంద్రబాబుకు బంధువైన బాలకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. ఈ కారణంగా అక్కడ అభివృద్ధి అవుతుందని అంతా భావించారన్నారు. అంతా అనుకున్నట్టు అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో అభివృద్ధి జరిగిందన్నారు. 


హిందూపురంలో వైసీపీ జెండా


ఈ అభివృద్ధిని చూపించే తమ అభ్యర్థులు విజయానికి కృషి చేస్తామన్నారు పెద్దిరెడ్డి. ఆ దిశగా కార్యకర్తలను ఎన్నికలకు సమాయాత్తం చేయడానికి వచ్చామన్నారు. మరో విడత కూడా హిందూపురంలో పర్యటిస్తానని చెప్పుకొచ్చారు హిందూపురంలో మొదటిసారి తమ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారన్నారు. 


అభివృద్ధి అజెండాతో ఎన్నికలకు


కుప్పం, హిందూపురం అనే తేడా తమకు లేదన్నారు పెద్దిరెడ్డి. రాష్ట్రమంతా ఒక్కటే యూనిట్‌గా చూస్తామని చెప్పారు. ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతున్నారని అందుకే రెండో నియోజకవర్గం కోసం చూస్తున్నారని అన్నారు. వైసీపీలో సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం ఉన్నమాట నిజమే అన్నారు పెద్దిరెడ్డి. గెలిచే పార్టీలో ఇలాంటి పోటీ సహజంగానే ఉంటుదని చెప్పుకొచ్చారు. అసలు చంద్రబాబు పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తమ వారిని తీసుకొని అభ్యర్థులుగా పోటీ చేయాల్సిన దుస్థితి ఉందని విమర్శించారు. 


టీడీపీ, జనసేనకు అభ్యర్థులు కరవు 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆయన ఒక్కటే పోటీ చేస్తానంటూ చెబుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. మిగతా అభ్యర్థులు ఎవరో ఎవరికీ తెలియదన్నారు. అభ్యర్థులు ఉంటే ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఇన్నిరోజులు కుప్పం, హిందూపురం టీడీపీకి కంచుకోటలంటూ ఊదరగొట్టారని అలాంటిదేమీలేదన్నారు పెద్దిరెడ్డి. అవి డొల్ల కోటలేనని విమర్శించారు. అభివృద్ధి జరిగకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు చోట్ల తామే ఎలా గులుస్తామని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


మంత్రికి నిరసన సెగ


లేపాక్షి మండలం మానెంపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. గౌరిగానిపల్లికి రహదారి వేయడంలేదని మంత్రిని ప్రజలు చుట్టముట్టి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి, ఇన్ ఛార్జి దీపికను చుట్టుముట్టి తమ గ్రామానికి రహదారి కావాలంటూ డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణం చేసే విషయం పరిశీలిస్తామని గ్రామస్తులకు మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు