తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల కల సాకారం చేసే దిశగా టీటీడీ అడుగులు వేసింది. శ్రీవారి భక్తుల కోసం కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ నివాసి వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు అన్నమయ్య నడయాడిన కాలిబాటను అభివృద్ధి చేసేందుకు టీటీడీ నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి బోర్డు సమావేశంలో ప్రకటించారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి కడప జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. గతంలో అన్నమయ్య కాలిబాట అభివృద్ధి విషయమై ఆకేపాటి దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి వద్ద తన ప్రతిపాదనను వినిపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అయితే ఆయన మరణానంతరం ఆ విషయం అటకెక్కింది. ఇదిలా ఉంటే 19వ సారి అన్నమయ్య కాలి బాట కోసం ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఈనెల 17న తిరుమల పాదయాత్ర చేపడుతున్న తరుణంలో అన్నమయ్య కాలిబాట అభివృద్దిపై కీలక నిర్ణయం వెలువడింది.
Also Read: తిట్ల నుంచి హత్య కుట్ర ఆరోపణల వరకూ ఏపీ రాజకీయాలు ! రాజకీయం అంటే అదేనా ? నేతలకు నైతికతే ఉండదా?
తిరుమలకు మూడో మార్గం
అన్నమయ్య నడిచిన కాలిబాటను పునరుద్ధరించడమే కాకుండా ఆ మార్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కడప జిల్లా వాసులు తీసుకోవడంతో కడప జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కాలిబాట అందుబాటులోకి వస్తే కడప, కర్నూలు, అనంతపురం, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంత వాసులకు తిరుమలకు వచ్చే సమయం మరింత తగ్గుతుంది. అన్నమయ్య కాలిబాట అందుబాటులోకి వస్తే తిరుమలకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇకపై తిరుపతికి వెళ్లే అవసరం లేకుండా... కడప నుంచి రైల్వేకోడూరు మీదుగా కుక్కలదొడ్డి, మామండూరు వెళ్లి అక్కడి నుంచి శేషాచలం కొండల్లో 18 కి.మీ వెళ్తే తిరుమలకు చేరుకుంటారు. ఇప్పటి వరకూ ఉన్న రెండు ఘాట్ రోడ్ల కన్నా ఇది సులభమైన మార్గం. అన్నమయ్య మార్గం ఇటు కాలిబాటతో పాటు రోడ్డు మార్గాన కూడా తిరుమలకు చేరుకోవచ్చు. భారీ వర్షాల సమయంలో రెండు ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటప్పుడు అన్నమయ్య మార్గం తిరుమలకు చేరుకోవడానికి మరో మార్గం ఉంటుంది.
Also Read: ఫిట్‌మెంట్ ప్రకటన మంగళవారమే .. కొన్ని ఉద్యోగ సంఘాలకు సజ్జల సమాచారం !
అన్నమయ్య నడిచిన మార్గం
రాజంపేట సమీపంలో ఉన్న తాళ్లపాక నుంచి 17వ శతాబ్దంలో శ్రీవారి భక్తుడు అన్నమయ్య ఈ మార్గం ద్వారా తిరుమలకు వెళ్తుండేవారని ప్రతీతి. ఇప్పటికీ ఈ మార్గం ద్వారా వేలాది మంది భక్తులు తిరుమలకు నడచి వెళ్తుంటారు. కడప-రేణిగుంట మార్గంలో రైల్వేకోడూరు మీదుగా మామండూరు వరకు హైవేపై వెళ్లి అక్కడి నుంచి 18 కిలోమీటర్లు అన్నమయ్య మార్గంలో నడిచి తిరుమలకు చేరుకోవచ్చు.
Also Read: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు