Foxlink Fire Accident : తిరుపతి జిల్లా రేణిగుంట ఫాక్స్ లింక్ ఎలక్ట్రిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటల్లో ఉద్యోగులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగతో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఫాక్స్ లింక్ పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
రేణిగుంట పారిశ్రామిక వాడలోని ఫాక్స్ లింక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని మొదటి అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాప్తి చెందడంతో దట్టమైన పొగ భవనం మొత్తం విస్తిరింది. మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ఒక్కసారిగా పరిశ్రమ నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. డేటా కేబుల్ తయారీ పరిశ్రమ కావడంతో మరింత వేగంగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. మొదటి అంతస్థు పూర్తిగా దగ్ధం కాగా....మిగిలిన అంతస్థులన్నీ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, వారిని రేణిగుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి దగ్ధం అయినట్లు యాజమాన్యం అంచనా వేస్తోంది.
ప్రాణనష్టం జరగలేదు -ఫ్యాక్టరీ యాజమాన్యం
అగ్నిప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో మూడు వేల మందికీ పైగా సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు.
మంటలు అదుపులోకి రాకపోవడంతో సిబ్బందిని బయటికి పంపించేశారు ఫ్యాక్టరీ సెక్యూరిటీ. ఇప్పటికి ఫ్యాక్టరీలో నుంచి పేలుడు శబ్ధాలు వస్తున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి ఫాక్స్ లింక్ పరిశ్రమ పూర్తిగా కాలిపోయింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం సంభవించలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది.
కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం
మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు స్క్రాప్ షాప్ తో పాటు 2 ప్లాస్టిక్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లు అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. వాటిలోని సామాగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ వాహనంతో పాటు మారుతి కారు కూడా దగ్ధమైనట్లు కూకట్ పల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులు దగ్ధం
సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం గుంపుల శివారులో హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై రెండు బస్సులు మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోన్న వెన్నెల బస్సులో సాంకేతికలోపంతో మంటలు చెలరేగాయి. బ్యాటరీలో సమస్యతో బస్సు లైట్లు ఆగిపోయాయి. అయితే ప్రయాణికులను వేరే బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. సూర్యాపేట నుంచి ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన మరో బస్సును తీసుకొచ్చి.. వైర్ల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. అనంతరం మంటలు చెలరేగాయి. ఆ మంటలు మరో బస్సుకు కూడా వ్యాపించారు. ప్రమాద సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.