CM Jagan : తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అపాచీ పరిశ్రమలో ఆడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులు తయారు చేస్తారు. మొదటి దశలో రూ. 350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అపాచీ పరిశ్రమ ద్వారా మొత్తం పదివేల మందికి ఉపాధి లభించనుంది.
రూ. 800 కోట్ల పెట్టుబడులు
శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులోని హిల్‌టాప్ ఎస్‌ఈజెడ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్(అపాచీ) భూమిపూజ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అపాచీ గ్రూపు అంటే ఆడిడాస్ షూస్ తయారు చేసే కంపెనీ అని, ఇక్కడ ఈ సంస్థ ఏర్పాటు వల్ల దాదాపుగా 10 వేల మందికి నేరుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మంచి ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా సుమారు రూ.800 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ నిర్మాణాలు ప్రారంభం అవుతున్నాయన్నారు. 2006లో దివంగత నేత వైయస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇదే అపాచీ, ఆడిడాస్ కంపెనీలను తడలో ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు.
మరో 9 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం
నేడు తడలో ఈ ఒక్క కంపెనీలోనే 15 వేల మంది పనిచేస్తున్నారని, అందులో దాదాపు 60 శాతం మంది చెల్లమ్మలే పని చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఆ తర్వాత ఇదే అపాచీ కంపెనీకి సంబంధించి ఇటీవల పులివెందులలో మరో 2వేల మంది చెల్లెమ్మలకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మరో 9 నెలల కాలంలో అవి కూడా పనులు పూర్తి చేసుకుని ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఇవాళ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టు కూడా మరో 15 నెలల్లోనే అంటే సెప్టెంబరు 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుందని, దీని వల్ల 10 వేల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇందులో 80 శాతం మంది చెల్లమ్మలే ఉద్యోగులుగా ఉంటాయన్నారు.
వకుళామాత ఆలయాన్ని ప్రారంభోత్సవం
తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్ నిర్మించిన శ్రీ వకుళామాత ఆలయాన్ని సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో సీఎం జగన్ ను సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. మంత్రి పెద్దిరెడ్డి తన సొంత నిధులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వకుళా మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిథి భవనం నిర్మిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు 20 కేజీల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ కు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
Also Read : Botsa Satyanarayana: వీళ్లకి ‘అమ్మ ఒడి’ వర్తిస్తుందా? మంత్రి బొత్స క్లారిటీ - వీరికే వర్తింపు
Also Read : Ammavodi Rules : అర్హులకే అమ్మఒడి ! మరి మీ పేరు ఏ జాబితాలో ఉందో తెలుసుకున్నారా?