BJP Satyakumar : ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అమరావతి రాజధానికి అసెంబ్లీలో అంగీకారం తెలిపి ఇప్పుడు మూడు రాజధానుల అంటూ జగన్ మాట మార్చడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రభుత్వం పరనింద, ఆత్మస్తుతి తప్ప నిజాలు చెప్పడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని నిర్మించలేని సీఎంగా జగన్ నిలిచిపోతారని ఆయన అన్నారు. ప్రజా గొంతుకుగా బీజేపీ వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. ఈనెల 19వ తేదీ నుంచి గాంధీ జయంతి వరకు ఐదు వేల వీధి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రానికి పట్టిన పీడ పోయేంత వరకు బీజేపీ పోరాడుతుందన్నారు.  


ప్రాంతాల మధ్య విద్వేషాలు 


రాజధాని అమరావతికి మద్దతిచ్చిన జగన్‌ ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సత్యకుమార్‌ ఆరోపించారు. రాజధాని నిర్మించుకోలేని అసమర్థ సీఎంగా చరిత్రలో నిలిచారన్నారు. పాలనా వికేంద్రీకరణ ముసుగులో సీఎం జగన్‌ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు దాటితే ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. న్యాయపరంగా సమస్యలు వస్తాయనే ఇన్నాళ్లు ఆగారన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందన్న నమ్మకం తమకుందని సత్యకుమార్ తెలిపారు. సీఎం  జగన్‌ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపై వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు.  


విశాఖలో మోదీ జన్మదిన వేడుకలు 


 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నేతలు వైజాగ్ బీచ్ లో స్వచ్చ సాగర్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్కే బీచ్ లోని విశాఖ మ్యూజియం ఎదురుగా బీచ్ లోని చెత్తా చెదారాన్ని క్లీన్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజీపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ దియోదర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జేవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ప్రధాని జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు అక్టోబర్ రెండు వరకూ జరుగుతాయని, అయితే కేక్ కటింగ్, పాలాభిషేకాల నిర్వహించమని సోము వీర్రాజు తెలిపారు. అది బీజేపీ సంస్కృతి కాదన్నారు.  






Also Read : GVL : న్యాయపరంగా మూడు రాజధానులు అసాధ్యం - వైఎస్ఆర్‌సీపీకి క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ !


Also Read : Three Capitals Issue : అమరావతి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం - వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి !