Three Capitals Issue :  అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మార్చి మూడో తేదీన స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీ మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని రైతులకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలను ఇచ్చింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది. హైకోర్టు మూడు రాజధానులు, పాటు సీఆర్డీఏ చట్టం పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం  తుది తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 


రిట్ ఆఫ్ మాండమస్ తీర్పు ప్రకటించిన ఏపీ హైకోర్టు 


ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో రాజధానిపై చట్టలు చేసే అధికారం లేదని  తీర్పు ఇస్తూ రిట్ ఆఫ్ మాండమాస్ ఇస్తున్నామని పేర్కొంది ఏపీ హైకోర్టు. అసలేంటీ రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఓ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ తాము చట్ట పరంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే...అంటే చేయని పక్షంలో ఆ పనులను చేసి తీరాల్సిందే అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరి ఆదేశాలు అన్నమాట. మాండమస్ ఇచ్చారు అంటే చేసి తీరాల్సిందే అని అర్థం.  అయితే మాండమస్ అనేది అన్ని సందర్భాల్లోనూ కోర్టు ఇవ్వదు. చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉన్నత న్యాయ స్థానాలకు ఉండే అత్యున్నత అధికారం ఇది. ప్రభుత్వం ద్వారా ఓ సర్టైన్ కేస్‌లో ప్రజలకు న్యాయం జరగటం లేదన్నపుడు మాత్రమే కోర్టు మాండమస్ ఇస్తుంది. మాండమస్ అనేది ఉన్నత న్యాయస్థానాలకు ఉండే అంతిమ ప్రత్యామ్నాయం. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మాండమస్ ను జారీ చేస్తాయి. 


చట్టాలు చేసే అధికారాన్ని హరించడమేనంటున్న ఏపీ ప్రభుత్వం


అయితే ఇలా రిట్ ఆఫ్ మాండమస్ ఇవ్వడం శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. చట్టాలు చేయడానికి శాసన వ్యవస్థకు రాజ్యాంగం అన్ని అధికారాలు ఇచ్చిందన్నారు. అలాంటప్పుడు శాసన వ్యవస్థ అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలోనూ ప్రభుత్వం చర్చించింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  


సుప్రీంకోర్టులో స్టే వస్తే మూడు రాజధానుల బిల్లు పెట్టే అవకాశం 


ఈ సమావేశాల్లో మరోసారి మూడు రాజధానుల బిల్లు పెట్టాలనుకుంటున్న ప్రభుత్వం..  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంలో స్టే వస్తే ఆ పని పూర్తి చేయాలనుకుంటోంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా సవాల్ చేస్తే నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని ఇప్పటికే  సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ పిటిషన్ ఎప్పటికి విచారణకు వస్తుందో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.