BJP MP Laxman : అభివృద్ధి లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని సీఎం జగన్ పై బీజేపి ఓబిసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. గురువారం సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ ఏపీ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాజధానిని అటకెక్కించి అమరావతి రైతులపై కత్తి దూస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక, ఎర్రచందనం, ఇతర ఖనిజాలు నిలువునా దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ, ఏపీలో కుటుంబ పాలనలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే విభజన చట్టం నీరుగారిపోతోందని విమర్శించారు. పథకాలకు పేర్లు మార్చి, కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లిస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోటాపోటీగా అప్పులు
అన్ని ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పు చేసిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. తామేమీ తక్కువ కాదన్నట్లు ఏపీ సర్కార్ ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. జగన్ విధానపరమైన నిర్ణయాలు ఏపీకి శాపంగా మారుతున్నాయని, రెండు రాష్ట్రాలలో సామాజిక న్యాయమన్న ఊసేలేదన్నారు. ప్రజాపోరు ద్వారా వైసీపీ తీరును ఎండ గట్టడంతో పాటు ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. ఎన్నో పార్టీలు ఏర్పాటైన తర్వాత కొంత కాలంలోనే టూలెట్ బోర్డులు పెట్టుకున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ గత నాలుగేళ్లుగా జాతీయ పార్టీ, ఫ్రంట్ పేరుతో ఊరేగుతున్నారని, దోచుకున్న ప్రజల డబ్బు, నల్లధనంతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఉద్ధరించలేని కేసీఆర్, దేశ ప్రజలను ఏం ఉద్దరిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విధానాలతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారన్నారు. ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేసీఆర్ తన స్వార్థం చూసుకుంటున్నారని ఆరోపించారు. కుటుంబ పాలనకు తెలంగాణలో స్థానం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.
Also Read : Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !
Also Read : పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై అధ్యయనం జరగాల్సిందే - కేంద్రానికి స్పష్టం చేసిన ఏపీ పొరుగురాష్ట్రాలు!