UP Politics: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత సమాజ్‌వాదీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు.
మేమే గెలిచాం!
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకే ఓటు వేశారని, అయినా కూడా తమ నుంచి ప్రభుత్వాన్ని భాజపా లాక్కుందని అఖిలేశ్ విమర్శించారు.
ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాదు. భాజపా మళ్లీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. యూపీలో అధికారం కోల్పోతే దిల్లీలో కూడా కోల్పోతామని వారికి తెలుసు. అందుకే వారి యంత్రాంగం ద్వారా సమాజ్‌వాదీ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని భాజపా లాక్కుంది. భాజపా, దాని మిత్రపక్షాల ఆజ్ఞల మేరకు దాదాపు ప్రతి అసెంబ్లీ స్థానంలో 20 వేల వరకు యాదవులు, ముస్లింల ఓట్లను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తొలగించింది. దీనిపై విచారణ జరిపితే చాలా మంది పేర్లను తొలగించినట్లు తెలుస్తుంది. - అఖిలేశ్ యాదవ్, ఎస్‌పీ చీఫ్
రేషన్ ఎందుకు?
కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందునే భాజపా.. ఉచిత రేషన్‌ను పొడిగించిందని అఖిలేశ్ విమర్శించారు.
చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో భాజపా రేషన్‌ను ఉచితంగా అందిస్తోంది. కానీ పేద ప్రజలకు స్ట్రెచర్ లేదా అంబులెన్స్‌ను ఎందుకు కల్పించలేకపోతున్నారు. బడా వ్యాపారులకు భారీ ప్రయోజనాలను మాత్రం ఇస్తారు. - అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
అరెస్ట్‌లకు సిద్ధం
జైళ్లకు వెళ్ళవలసి వచ్చినా కూడా మేం కేంద్ర, రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాలపై పోరాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయి. దిల్లీ, లఖ్‌నవూలో (కేంద్ర, రాష్ట్రాల్లో) ఉన్న ప్రభుత్వాలు వ్యవస్థలను కబ్జా చేశాయి. పోరాడటానికి మేం భయపడం. 2024 ఎన్నికల్లో భాజపాను ఓడించాలి. ఇందుకోసం మేం కలిసి పని చేస్తాం. సోషలిస్టులు, దళితుల మధ్య ఐకమత్యం రావాలి. ఈ వర్గాలవారు మా పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు. అయినా రుణ మాఫీలు ఎక్కువగా గుజరాతీ వ్యాపారవేత్తలకే అందుతున్నాయి. పరిశ్రమలను గుజరాత్‌కు తీసుకెళ్లిపోతున్నారు. - అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
Also Read: Lakhimpur Bus Accident: గాయపడిన చిన్నారిని చూసి బోరున ఏడ్చిన ఐఏఎస్ ఆఫీసర్!
Also Read: Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గహ్లోత్ ఔట్- సారీ చెప్పి తప్పుకున్న సీఎం