Tiruamala News : ఆన్లైన్ లో తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీపడ్డారు.  కేవలం 44 నిముషాల్లో 2.20 లక్షల టికెట్లు కొనుగోలు చేశారు. టీటీడీ వెబ్ సైట్ కు ఒకేసారి 2 లక్షల 50 వేల మంది హిట్స్ వచ్చాయని అధికారులు చెప్పారు. ఈసారి టీటీడీ ఐటీ విభాగం ముందు జాగ్రత్తగా జియో క్లౌడ్ ని మూడు రెట్లు అధికంగా స్కేలింగ్ చేసుకుని మరి జాగ్రత్తలు తీసుకుంది. ఎలాంటి సమస్యలు లేకుండా భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కొనుగోలు చేశారని టీటీడీ వెల్లడించింది. 


44 నిమిషాల్లో 2.20 లక్షల టికెట్లు బుకింగ్ 


శ్రీవారి దర్శనానికి ఆ డిమాండే వేరు. ఇక వైకుంఠ ద్వార దర్శనం అంటే భక్తులు భారీగా తరలివస్తుంటారు. వైకుంఠ ద్వార టికెట్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు భక్తులు. ఎలాంటి ప్రయత్నాలు లేకుండా ఉంట్లోనే కూర్చొని సులభతరంగా టికెట్లను బుక్ చేసేందుకు టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి దర్శన టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in లో టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తుంది టీటీడీ. భక్తులు ఎంతగానో వేచి చూసిన వైకుంఠ ద్వారా దర్శనాల టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆఫిసియల్ వెబ్ సైట్ లో విడుదల చేసింది. రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు 2.20 లక్షల టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఉదయం నుంచే వేచి ఉన్న భక్తులు 9 గంటలకు ఒక్కసారిగా టీటీడీ ఆఫీసియల్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యారు. ఒక్కసారిగా 2.50 లక్షల హిట్స్ వచ్చినా ఎలాంటి అంతరాయం లేకుండా టికెట్ల జారీ ప్రక్రియ సాగింది. 44 నిమిషాల్లో 2.20 లక్షల టిక్కెట్లు హాట్ కేకుల్లా బుక్ చేసుకున్నారు భక్తులు. ఈసారి టీటీడీ ఐటీ విభాగం ముందు జాగ్రత్తగా జియో క్లౌడ్ ని మూడు రెట్లు అధికంగా  స్కేలింగ్ చేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులు కొనుగోలు చేశారని టీటీడీ తెలిపింది.  


రోజుకు 50 వేల టికెట్లు 


జనవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. దర్శన టికెట్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం చేయిస్తామని పేర్కొంది. టికెట్లు లేని వారిని దర్శనానికి అనుమతి ఉండదని చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 20 వేలు, సర్వదర్శనం టికెట్లు రోజుకి 50 వేల టికెట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి 5 లక్షల సర్వ దర్శనం టికెట్లు కేటాయిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శన టికెట్ల కోసం తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు, తిరుమలలో ఒక్క కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.  


రోజుకు 2 వేల శ్రీవాణి టికెట్లు 


ప్రతిరోజు ఉదయం రెండు గంటల నుంచి టికెట్లు కేటాయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు‌ పొందే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వ దినాల్లో అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో రోజుకి 2 వేల చొప్పున కేటాయిస్తామన్నారు. శ్రీవాణి టికెట్లు కలిగిన వారికి మహాలఘు దర్శనం కల్పిస్తామని వివరించారు. పోలీసులు, జిల్లా అధికారులు భక్తులకు అవసరమైన సౌఖర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గోవింద మాల భక్తులు కూడా టికెట్లు తీసుకునే రావాలన్నారు. వారికి ప్రత్యేక దర్శనాలు ఏమీ ఉండవని చెప్పుకొచ్చారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకి రావచ్చు కానీ దర్శనానికి అనుమతి ఉండదని వివరించారు. డిసెంబరు 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు వసతి రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.