Hanamkonda News :హన్మకొండ జిల్లా కమలాపూర్ పాఠశాలలో విద్యార్థిని మగబిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపుతోంది. అభంశుభం తెలియని ఓ విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. పాఠశాలలోని బాత్రూంలో విద్యార్థిని ప్రసవించింది. ఎలాంటి వైద్య సహాయం, వైద్యులు లేకుండానే ఆ విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
కొన్ని నెలల క్రితం కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఓ బాలిక బాత్రూం గదిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాత్రూంకి వెళ్లిన ఆ బాలిక ఇంకా బయటికి రావడం లేదని అనుమానం వచ్చిన అక్కడి సిబ్బందికి బాత్రూంలోకి వెళ్లి చూసేసరికి ఆ బాలిక ప్రసవించి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కంగారు పడ్డ సిబ్బంది ప్రిన్సిపాల్ కు విషయం తెలిపారు. వెంటనే ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య భట్టుకి విషయం తెలిపి ఆయన ఆదేశాల ప్రకారం అదే రోజు రాత్రి ఓ వాహనంలో ఆ బాలికతో పాటు పుట్టిన మగ బిడ్డను మరో చోటికి తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి విషయాన్ని బయటకి రాకుండా ప్రిన్సిపాల్ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పాఠశాలలో ప్రసవించిన ఆ బాలిక గర్భవతి ఎలా అయింది? ఆ బాలిక గర్భానికి కారకులు ఎవరు? పాఠశాలలోనే ప్రసవం జరిగే వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఆ బాలిక గర్భవతిగా ఉన్నట్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్
కమలాపూర్ ఎంజేపీ బాలికల పాఠశాలలో జరిగిన ఈ సంఘటనను గోప్యంగా ఉంచి బాలిక భవిష్యత్తును నాశనం చేసిన వారిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో పిల్లలని వదిలి వెళ్తే ఎలాంటి వార్త వింటామో అని తల్లిదండ్రులు బిక్కుబిక్కుమనే పరిస్థితి ఎదురైంది. బాధ్యత గల ప్రిన్సిపాల్ ఎంజేపీ సెక్రెటరీ మల్లయ్య భట్టు ఆ బాలికను, జన్మించిన బిడ్డను తరలించే ఏర్పాట్లు చేయడం వెనుక అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఆ బాలిక ప్రసవం వరకు పాఠశాలలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, ఒకవేళ అంతకుముందే బాలిక గర్భవతిగా ఉన్నట్లు వారు గమనించి ఉంటే ప్రసవం పాఠశాలలో జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలో ఇలాంటి సంఘటనలు విద్యావ్యవస్థను అభాసుపాలు చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కమలాపూర్ ప్రభుత్వ ఎంజేపీ బాలికల పాఠశాలలో జరిగిన ఈ సంఘటనపై సంబంధిత మంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ వారి భవిష్యత్తుకి మార్గం చూపెట్టాల్సిన ఉపాధ్యాయులు వారి ప్రవర్తనను కూడా గమనించలేని స్థితిలో ఉన్నారనడానికి ఈ ఘటన నిదర్శనం అన్నారు. అయితే బాలికకు ఈ పరిస్థితి రావడానికి బాధ్యులెవరనే విషయంపై దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.