IND vs BAN 2nd Test:  భారత్- బంగ్లా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్లు రాణిస్తున్నారు. వికెట్ నష్టపోకుండా 7 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. అశ్విన్, జైదేవ్, ఉనద్కత్, సిరాజ్, అక్షర్ పటేల్ లు తలా వికెట్ పడగొట్టారు. 


87 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్లో అశ్విన్, శాంటో (5)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. సిరాజ్ 13వ ఓవర్లో  మోమినల్ హక్ (5) ను కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత షకీబుల్ హసన్, జకీర్ హసన్ లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద ఉనద్కత్ బౌలింగ్ లో షకీబ్ (13) ఔటయ్యాడు. ఆ వెంటనే ముష్ఫికర్ రహీం (9)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. అయితే జకీర్ హసన్ నిలబడటంతో లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్లకు 71 పరుగులు చేసింది. 






బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీమ్‌ఇండియా 314 పరుగులు చేసింది. పంత్‌, శ్రేయస్‌లు కీలక భాగస్వామ్యాలతో జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. వీరిద్దరూ తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. అయితే జట్టుకు 87 పరుగుల ఆధిక్యం అందించారు.