TTD Key Decisions: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు టీటీడీ పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది. 4,736 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 4,200 కార్పొషన్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. అలాగే, అటవీ కార్మికుల జీతాల పెంపునకు నిర్ణయించినట్లు చెప్పారు. వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లించనున్నామని తెలిపారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకపై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో జయ విజయల వద్ద ఉన్న తలుపులకు రూ.1.69 కోట్లతో బంగారు తాపడం చేయనున్నట్లు వివరించారు. అటు, ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
కీలక నిర్ణయాలివే
☛ తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం
☛ రూ.4 కోట్లతో 4, 5, 10 గ్రాముల తాళిబొట్ల తయారీ, 4 కంపెనీలకు టెండర్ కేటాయింపు
☛ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి విద్యుత్ అలంకరణలకు ఆమోదం
☛ భక్తుల సౌకర్యార్థం అలిపిరి గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం చేసేందుకు నిర్ణయం. ఇందు కోసం విరాళంగా రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు సుముఖత
☛ కార్పొరేషన్ లోని అటవీ శాఖ కార్మికులకు తిరిగి సొసైటీలో చేర్చి జీతాలు పెంపు
☛ రూ.4.12 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు అలిపిరి వద్ద శాశ్వత భవనం నిర్మాణం
☛ రూ.3.15 కోట్లతో తిరుమలలో పలు చోట్ల కొత్త మోటార్ పంపు సెట్లు ఏర్పాటు
☛ తిరుమలలో ఎఫ్ఎంఎస్ సేవలు మరో మూడేళ్లు పొడిగింపు
☛ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు బంగారుపూత చేయాలని నిర్ణయం
☛ అలిపిరి, గాలిగోపురం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల వద్ద ఉన్న నీటి బావుల ఆధునికీకరణ
☛ బాల బాలికలు సులభ శైలిలో వివిధ భాషల్లో భగవద్గీత పుస్తకాలు రూపొందించేందుకు రూ.3.72 కోట్లు కేటాయింపు
☛ శ్రీలంకలో శ్రీవారికి కల్యాణం నిర్వహించాలన్న నిర్ణయానికి మండలి ఆమోదం
☛ తిరుపతిలోని హరే రామ హరే కృష్ణా రోడ్డులో రూ.7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం
☛ టీటీడీలోని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీపై భోజన సదుపాయం
☛ రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం, అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయం
రమణ దీక్షితులపై చర్యలు
సీఎం జగన్‌తోపాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై తిరుమల దేవస్థానం చర్యలు తీసుకుంది. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వారం రోజుల క్రితం రమణ దీక్షితులు సీఎం జగన్, టీటీడీ అధికారులు, అహోబిలం మఠం, జీయర్‌లపై చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. దీనిపై చర్చించిన పాలక మండలి రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై రమణదీక్షితులు వారం రోజుల క్రితం చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయింది. దీన్ని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వీడియోపై రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్‌కి గురైనట్టు ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో ఉన్న తనకు సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మందికి తానంటే అసూయని చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరన్నారు. అయినా ప్రభుత్వం ఆయన ఖండనను పరిగణలోకి తీసుకోలేదు.