TS School Books: తెలంగాణలో పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది. తరగతిని బట్టి పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. విద్యార్థుల పాఠ్యపుస్తకాల ముద్రణను వినియోగించే పేపర్ మందం తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పటిదాకా పుస్తకాల కోసం 90 జీఎస్‌ఎం మందం ఉన్న పేపర్‌ను వినియోగించేవారు.. ఇకపై 70 జీఎస్‌ఎం మందం పేపర్‌ను వినియోగించడానికి ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పుస్తకాలు తేలికగా, సన్నగా మారనున్నాయి. ఇక పుస్తకాల కవర్ పేజీ మందం ప్రస్తుతం 250 జీఎస్‌ఎం ఉండగా, తాజాగా 200 జీఎస్‌ఎంకు తగ్గించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యార్థులకు ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా ప్రతి నెలలో చివరి శనివారం బ్యాగ్‌లెస్‌డేగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు విద్యార్థులు బ్యాగ్ లేకుండాగానే బడికొస్తారు. వారికి కొన్ని కృత్యాల ద్వారా పాఠాలను నేర్పిస్తున్నారు.
1.90 కోట్ల ఉచిత పుస్తకాల ముద్రణకు ప్రణాళికలు..
2024-25 విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో 1 నుంచి 10 తరగతుల్లోని విద్యార్థులందరికీ ద్విభాషా పుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్) అందజేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పుస్తకం సైజు పెరగడంతో పుస్తకాలను పార్ట్ -1, పార్ట్ -2గా విభజించారు. ఏప్రిల్ 30లోపు పార్ట్ -1 ముద్రిత పుస్తకాలను జిల్లా పాయింట్లకు చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇక జూలైలో పార్ట్ -2 పుస్తకాలను అందిస్తారు. స్మార్ట్‌ఫోన్లలో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్‌చేసి అన్ని తరగతుల్లో పుస్తకాల పాఠాలను విద్యార్థులు చదువుకోవచ్చు. 1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఇందుకోసం రూ.150 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని లెక్క తేల్చారు.
తగ్గిన ఆర్థిక భారం..
పాఠ్య పుస్తకాల బరువుతోపాటు ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత విద్యా సంవత్సరం(2022-23) వరకు 70 జీఎస్‌ఎం కాగితాన్నే ముద్రణకు వినియోగించేవారు. ఇటీవల కాలం వరకు విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ దాన్ని 90 జీఎస్‌ఎంకు పెంచారు. ఒక పుస్తకాన్ని తెలుగు- ఆంగ్ల భాషాల్లో ముద్రిస్తున్నారు. దీంతో ఒక పుస్తకాన్ని రెండు భాగాలుగా చేసి ముద్రిస్తున్నారు. అయిదు నెలలకు అంత మందం అవసరం లేదని అభిప్రాయం వ్యక్తమైనా ప్రస్తుత విద్యా సంవత్సరం(2023-24) 90 జీఎస్‌ఎంతో పుస్తకాలను పంపిణీ చేశారు. బరువుతోపాటు ధరలు 40- 50 శాతం వరకు పెరిగాయి. ఉదాహరణకు 10వ తరగతిలో ఎనిమిది పుస్తకాల ధర రూ.1074 ఉండగా అది రూ.1600 వరకు పెరిగింది. పుస్తకాల బరువు తగ్గించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం కొత్తగా నియమితులైన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరింది. మందం తగ్గితే సర్కార్‌కు దాదాపు రూ.50 కోట్ల ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. పేపర్ మందం తగ్గించడంతో విద్యాశాఖ కొనుగోలు చేయాల్సిన పేపర్ 3 వేల టన్నులకు పైగా తగ్గింది. ఇది వరకు వినియోగించిన 90 జీఎస్‌ఎం పేపర్‌తో ఏటా 11,700టన్నుల పేపర్‌ను సేకరించాల్సి ఉండగా, 70 జీఎస్‌ఎంకు తగ్గించడంతో 8 వేల టన్నులకు చేరింది. బడ్జెట్ కూడా రూ.30 నుంచి 40 కోట్లకు తగ్గింది.
తగ్గిన భారం ఇలా..
➥ 1వ తరగతి విద్యార్థుల పుస్తకాల బరువు ఇదివరకు 1.991 కేజీలుగా ఉండేది. ఇప్పుడది 1.408 కేజీలకు తగ్గింది.
➥ 6వ తరగతి విద్యార్థుల పుస్తకాల బరువు ఇదివరకు 2.253 కేజీలుగా ఉండేది. ఇప్పుడది 1.759 కేజీలకు తగ్గింది.
➥ 10వ తరగతి విద్యార్థుల పుస్తకాల బరువు ఇదివరకు 5.373 కేజీలుగా ఉండేది. ఇప్పుడది 4.190 కేజీలకు తగ్గింది.