Rajahmundry News:తెలుగుదేశం-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకావడంతో చాలా నియోజకవర్గంలో చిక్కుముడులన్నీ వీడిపోయాయి. అభ్యర్థులు ఖరారైన చోట చిన్నపాటి అలకలు, అసంతృప్తులు చోటుచేసుకుంటుండగా...చంద్రబాబు స్వయంగా  రంగంలోకి దిగి వారిని పిలిపించి మాట్లుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. కానీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని చోటే ఇబ్బందులు వీడటం లేదు. తెలుగుదేశం కంచుకోటలపై జనసేన గురిపెట్టడం...టిక్కెట్ మాదేనంటే మాదేనని ఎవరికి వారు ప్రకటించుకోవడం అధినేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజవర్గం అభ్యర్థి ఎంపిక అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కల్యాణ్ కు ఇబ్బందిగా మారింది.
నువ్వా నేనా
గోరంట్ల బుచ్చయ్య చౌదరి..కాకలుతీరిన రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నిస్వార్థ సేవకుడు. ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 75 ఏళ్ల వయసులోనూ  యువకుల మాదిరిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గత ఎన్నికల్లో జగన్ గాలిలోనూ  ఎదురునిలిచి గెలిచి సత్తా చాటారు. వైసీపీపై ఒంటికాలిపై లేచే బుచ్చయ్య అంటే అటు చంద్రబాబుకు, తెలుగుదేశం నేతలకు ఎంతో అభిమానం. ఇప్పటికీ రాజకీయాల నుంచి విరమించేది లేదని స్పష్టంగా ప్రకటించిన బుచ్చయ్యచౌదరి..మరోసారి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అయితే ఈసీటు జనసేనకోరుతోంది. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు పేరు ప్రకటించినందున రూరల్ సీటు తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ గట్టిగా పట్టుబడుతున్నారు. దీనికి ఒక కారణం ఉంది. జనసేనలో కీలకంగా వ్యవహరించే పది నాయకుల్లో కందుల దుర్గేశ్ ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ వెంటే నడుస్తున్న దుర్గేశ్... తూర్పుగోదావరి జిల్లాకు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పట్టు సాధించిన దుర్గేశ్....ఆ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య జగన్ తో భేటీ అనంతరం రాజమండ్రి రూరల్ సీటు తనదేనంటూ ప్రకటించడంపై బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను తనను కాదని ఈ సీటు జనసేనకు ఎలా కేటాయిస్తారని ఆయన కందుల దుర్గేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పొత్తుల సమయంలోనే చంద్రబాబు పవన్ కు చాలా క్లారిటీగా చెప్పారని తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు తప్ప..మిగిలినవి ఇవ్వడానికి ఓకే అన్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన వెంటే ఉన్న వారికి ఇప్పుడు సీట్లు నిరాకరిస్తే...ప్రజలకు, కార్యకర్తలకు రాంగ్ మెసేజ్ వెళ్తుందని సర్దిచెప్పినట్లు తెలిసింది.
నిడదవోలుకు కందుల
రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన కందుల దుర్గేశ్ కు జనసేన తరఫున నిడదవోలు సీటు కేటాయించబోతున్నట్లు తెలిసింది. నిడదవోలు రాజమండ్రికి సమీపంలోనే ఉండటం..ఇక్కడ కూడా జనసేనకు పట్టు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పవన్ దుర్గేశ్ కు స్పష్టతనిచ్చారని తెలిసింది.  శనివారం మధ్యాహ్నం సీట్లు ప్రకటించాక పవన్‌ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి దుర్గేశ్‌ను పిలిపించి మాట్లాడారు. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం సిటింగ్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి బరిలో దిగుతున్నట్లు దుర్గేశ్‌కు పవన్‌ స్వయంగా చెప్పారు. నిడదవోలు నుంచి దుర్గేశ్‌ బరిలో దిగుతుండటంతో ఉత్కంఠకు తెరపడింది. కార్యకర్తలు, నేతలతో మాట్లాడిన తర్వాతే తన అభిప్రాయం చెబుతానని కందుల దుర్గేశ్ పవన్ కు చెప్పారు. ఆయన మాటలు చూస్తుంటే నిడదవోలు వెళ్లేందుకు అంగీకరించినట్లే తెలుస్తోంది. పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైనా ఒత్తిళ్లు ఉంటాయి. దీని వల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని...వారి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నారు. నిడదవోలులోనూ  తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుందని....ఖచ్చితంగా గెలిచే సీటు తమకు ఇస్తున్నప్పుడు తాము కూడా ఒక మెట్టు దిగాల్సిందేనన్నారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీచేయమన్నా చేస్తానన్న కందుల దుర్గేశ్..ఎట్టిపరిస్థితుల్లోనూ  జనసేనను వీడేది లేదని, స్వతంత్రంగా పోటీచేసే ఆలోచనల లేవన్నారు.