Ysrcp Mla Vasantha Krishna Prasad Will Join in Tdp: తాను రెండ్రోజుల్లో టీడీపీలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) తెలిపారు. ఐతవరంలో (Ithavaram) సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మైలవరం (Mylavaram) నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని.. ఆయన సమక్షంలో టీడీపీలో చేరతానని స్పష్టం చేశారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని.. టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటామని అన్నారు. 'చంద్రబాబు, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారు. ఆ పార్టీలో ఉండలేక టీడీపీలో చేరుతున్నా. వైసీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారు.' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, చాలాకాలంగా వసంత కృష్ణప్రసాద్ సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై కూడా పరోక్షంగా విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని మైలవరం ఇంఛార్జీగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.



'ఉమతో కలిసి పని చేస్తా'


దేవినేని ఉమతో కలిసి పని చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. మైలవరం సీటుపై టీడీపీ అధిష్టానం రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తుందని చెప్పారు. తనతో పాటు టీడీపీలోకి వచ్చే వైసీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెత్తనం చేయడం కాదని.. వారి సారథ్యంలోనే తాము కలిసి పని చేస్తామని అన్నారు. 'ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారు. ఉమాతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. ఇప్పటివరకూ ఉమ, నేను చెరో దారిలో పని చేశాం. ఇప్పుడు ఒకేదారిలో ప్రయాణం చేస్తాం. అవసరమైతే పార్టీ అధిష్టానం సమక్షంలో మాట్లాడి దేవినేని ఉమతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పార్టీ హైకమాండ్ నియోజకవర్గం ఎవరికి అప్పచెప్పితే దాని ప్రకారం నడుచుకుంటాను. దేవినేని ఉమతో ఇప్పటివరకూ జరిగిన విషయాలపై క్లారిటీ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు సీఎం కావడానికి ఎవరితో అయినా కలిసి పని చేసేందుకు సిద్ధం.' అని స్పష్టం చేశారు.


మరోవైపు, టీడీపీ - జనసేన ఉమ్మడి జాబితా విడుదలైన నేపథ్యంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఆయా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇవ్వడంతో అసంతృప్తులు ఒక్కొక్కరిగా శాంతిస్తున్నారు. అటు, కీలకమైన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తలనొప్పిగా మారింది. ఈ సీటును టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ ఆశిస్తున్నారు. అయితే, గోరంట్ల బుచ్చయ్యకే రాజమండ్రి రూరల్ సీటు అప్పగించి.. కందుల దుర్గేశ్ కు నిడదవోలు సీటు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దుర్గేశ్ కు పవన్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. అయితే, కార్యకర్తలు, నేతలతో మాట్లాడిన తర్వాతే తన అభిప్రాయం చెబుతానని కందుల దుర్గేశ్ పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 


Also Read: Rajahmundry News: బుచ్చయ్యకే రాజమండ్రి రూరల్- నిడదవోలుకు కందుల దుర్గేశ్ షిప్టు