ఉదయాస్తమాన దర్శనాలకు టీటీడీ ధరలు నిర్ణయించడంపై వివాదం నెలకొంది. భక్తులకు ఉచితంగా అందించాల్సిన సేవలకు రూ.కోటిన్నర ధర నిర్ణయించడం ఏమాత్రం ధర్మసమ్మతం కాదని కిష్కింద హనుమ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీపై విమర్శలు చేశారు. టీటీడీలో ఐఏఎస్ లు,‌ ఇతర ప్రభుత్వ అధికారులు తిష్ట వేసుకుని కూర్చుని ఆలయ సంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, అర్చకులపై పెత్తనం చెలాయిస్తూ దేవాలయాలను పెట్టుబడుల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పిల్లల ఆసుపత్రి కట్టడం అనేది ప్రభుత్వం యోచన మంచిదే కానీ అందుకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకుండా రాజకీయ ఉద్దేశాలతో తిరుమల శ్రీవారి నిధులను మళ్లించడం ఎంత మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. 


Also Read: శ్రీవారి ఉదయాస్తమాన టికెట్ ధర కోటి.. మెుత్తం ఎన్ని టికెట్లు ఉన్నాయంటే? 


సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుసరించాలి


తిరుమల శ్రీవారి ఆదాయం కోటీశ్వరుల జేబులో సొత్తు కాదని గోవిందానంద సరస్వతి స్వామీజీ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి తక్షణం తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈవోలు, అధికారులు, పాలకులు ఖాళీ చేసి అక్కడి పెద్ద జీయర్లు, చిన్న జీయర్లకు ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఆలయాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మతపరమైన అంశాల జోలికి ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని ఆయన తెలిపారు. 


సేవా టికెట్లతో వ్యాపారం సరికాదు


శ్రీవారి సేవా టికెట్లతో టీటీడీ వ్యాపారం చేయడం సరికాదని రాయలసీమ పోరాట సమితి నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..భక్తుల విశ్వాసాన్ని ఆదాయ మార్గాలుగా మార్చవద్దని టీటీడీకి హితవు పలికారు. ఉదయస్తమాన సేవా టికెట్‌ ధర పెంపుపై టీటీడీ మరోసారి ఆలోచించాలని డిమాండ్ చేశారు. టికెట్ ధర పెంపుతో పేదలు స్వామి సేవలో పాల్గొనే అవకాశం కోల్పోతారని ఆయన అన్నారు. 


Also Read: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... అన్నమయ్య కాలిబాటకు టీటీడీ గ్రీన్ సిగ్నల్... తిరుమలకు 40 కి.మీ తగ్గనున్న దూరం


ఉదయాస్తమాన టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం 


కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను నిర్ణయించింది టీటీడీ. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన టికెట్ ధర.. కోటి రూపాయలు ఉండగా.. శుక్రవారం రోజున కోటిన్నరగా నిర్ణయించారు. టీటీడీ దగ్గర 531  ఉదయాస్తమాన సేవా టికెట్లు ఉన్నాయి. ఉదయాస్తమాన టికెట్ తో సుమారు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఉదయాస్తమాన సేవా టికెట్లకో టీటీడీకి 600 కోట్ల పైగా ఆదాయం రానుంది. విరాళాల మొత్తంతో చిన్నారుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నారు. 2022 జనవరి రెండో వారం నుంచి టికెట్ల కేటాయింపునకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23న ట్రయల్‌ రన్‌ నిర్వహించనుంది. శ్రీవారికి తిరుమలలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఆర్జిత సేవలను ఉదయాస్తమాన సేవ అంటారు. సుప్రభాత సేవ,  తోమాల సేవ, కొలువు, అష్ట దళ పాద పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన), అభిషేకం, వస్త్రాలంకార సేవ, కల్యాణోత్సవం, రథోత్సవం, తిరుప్పావడ, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ జరుగుతాయి.







Also Read:  10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి