Tirumala : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కుల వాడైన శ్రీనివాసుడు కొలువైయున్న పుణ్యక్షేత్రం తిరుమల. కొర్కేలు తీర్చే కోనేటి రాయుడు కాబట్టి వేంకటేశ్వర స్వామి వారికి ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు భక్తులు. కోరిక నెరవేరిన వెంటనే నగదుతో పాటుగా బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా, మణులు మణిక్యాలు పొదిగిన కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు భక్తి భావంతో సమర్పిస్తుంటారు భక్తులు. అంతేకాకుండా స్వామి వారి పేరిట కోట్ల విలువ చేసే భూమి పత్రాలు కూడా భక్తి శ్రద్దలతో సమర్పిస్తుంటారు. ఇలా దేశ నలువైపులా నుంచి తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ రూపాల్లో వారి వారి స్థోమత తగ్గట్టుగా కానుకలను సమర్పిస్తుంటారు. భక్తుల సమర్పించిన కానుకలను అత్యంత భధ్రత నడుమ వాటిని లెక్కించి భద్రంగా ఉంచుతారు టీటీడీ అధికారులు.
భక్తుల రద్దీతో
ప్రపంచ మానవాళి ఎప్పుడూ ఊహించని ఉపద్రవం రూపంలో కరోనా వ్యాప్తితో గడగడపోయారు. కరోనా వ్యాప్తి టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 83 రోజుల పాటు శ్రీనివాసుడి దర్శనానికి భక్తులకు అనుమతిని టీటీడీ రద్దు చేసింది. భక్తుల అనుమతి రద్దు చేసి ఏకాంతంగా స్వామి వారికి కైంకర్యాలను నిర్వహించింది. కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతిస్తూ వచ్చారు. దీంతో స్వామి వారి హుండీ ఆదాయం కూడా అంతంత మాత్రంగానే లభించింది. దీంతో ప్రతి ఏటా అంచనా వేసే టీటీడీ బడ్జెట్ సైతం అంచనా తప్పింది. ఇక కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి రావడంతో ఏప్రిల్ నుండి సర్వదర్శనం భక్తులను అనుమతించింది టీటీడీ. భక్తుల రద్దీతో స్వామి వారి హుండీ ఆదాయం క్రమేపి పెరుగుతూ వచ్చింది.
వరుసగా ఆరో నెల రూ. 100 కోట్ల మార్క్
ఈ క్రమంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా ఆగస్టు నెలలో శ్రీవారికి అత్యధికంగా హుండీ ద్వారా కానుకలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో రూ.128 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.127.5 కోట్లు, మే నెలలో రూ.130.5 కోట్లు, జూన్ నెలలో రూ.123.76 కోట్ల హుండీ ఆదాయం లభించింది. జులై నెలలో హుండీ ద్వారా రూ.139.45 కోట్ల ఆదాయం లభించగా, ఆగస్టు మాసంలో ఆ రికార్డు బ్రేక్ చేస్తూ 140.7 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకలు వచ్చాయి. ఇక మొత్తం నాలుగు నెలల్లో రూ.789.91 కోట్లు స్వామి వారికి కానుకలు అందాయి. వరుసగా ఆరో నెల రూ.100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటగా, ఆగష్టు మాసంలో 22 లక్షల 80 వేల 84 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పది లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది తలనీలాలు సమర్పించారు. 1954 జూన్ లో స్వామి వారికి రూ.5,35,703 హుండీ ఆదాయం రాగా, 2015-2016 సంవత్సరంలో ఏకంగా రూ.1010 కోట్లు ఆదాయం వచ్చింది. కరోనా వ్యాప్తికి గత రెండేళ్లుగా హుండీ ఆదాయం ఊహించని స్థాయిలో తగ్గింది. కరోనా సమయంలో స్వామి వారిని దర్శించలేని భక్తులు ఒక్కసారిగా తిరుమలకు అధిక సంఖ్యలో విచ్చేస్తుండడంతో క్రమేపి హుండీ ఆదాయం పెరుగుతుంది.
Also Read : CM Jagan Review : ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం జగన్ క్లాస్