Tirumala News: నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివార రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను జరిపించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంత్రం సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన శిష్వక్సేనుడు ఛత్రచామర, మేళ తాళాల నడుమ మాడ వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. సోమవారం సాయంత్ర 6.15 గంటల నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేశారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుదంరంగా తీర్చిదిద్దారు. 










అయితే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ నేడు తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని నాలుగు దిక్కులను కలుపుతూ.. యాత్రికులు తిరుమల వెళ్లేందుకు నిర్మించిన శ్రీనివాస సేతు (ఫ్లైఓవర్)ను 3.50 గంటలకు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 4.30 గంటలకు సీఎం జగన్ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకుంటారు. అనంతరం 5.40 గంటలకు వకుళమాత రెస్ట్ హౌస్, 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ లు ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారు. 


రేపటి షెడ్యూల్ ఇదే..!


మంగళ వారం ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు. ఉదయం 8.50 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజక వర్గాలకు తాగు, సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా డోన్ కు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.