తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 19న జరుగనున్న గరుడవాహనసేవలో కొన్ని మార్పులు చేసింది టీటీడీ. ఎక్కువ మంది భక్తులు గరుడసేవను వీక్షించాలనే ఉద్దేశంతో రాత్రి 7గంటలకు బదులుగా సాయంత్రం 6:30 గంటలకే గరుడసేవను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాదు... ఎక్కువ మంది సామాన్య భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది.
తిరుమల వేంకటేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడసేవ. ఈ సేవను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ముందురోజు నుంచే గ్యాలరీల్లో నిరీక్షిస్తుంటారు. వారి సౌలభ్యం కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాతే వాహనసేవ నిర్వహిస్తారు. అక్టోబరు 19న సాయంత్రం 6:15 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. దీంతో సాయంత్రం 6:30 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుండగా... ఆ సమయాన్ని రాత్రి 7గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు గరుడసేవ సమయాన్ని మరో అరగంట ముందుకు మార్చడం జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. ముందుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను కూడా రద్దు చేసింది టీటీడీ. ఈనెల 14 నుంచి 23వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేసింది.
బ్రహ్మోత్సవాల విశిష్టత
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోనే అత్యంత పాముఖ్యత ఉంది. వేంకటాచల క్షేత్రంలో స్వామివారు వెలసిన తోలిరోజుల్లో శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి లోకకళ్యాణార్ధం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడట. శ్రీవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు తోమ్మిది రోజులు పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహించారట. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి.
వైకుంఠంలో వుండే శ్రీమహావిష్ణువు... భక్తుల కోసం భువిలో కొలువైన పవిత్ర స్ధలం తిరుమల. నిత్యకళ్యాణం పశ్చతోరణం అయిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకతే వేరు. తొమ్మిది రోజుల పాటు ఆ దేవదేవుడే భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే.. మహాత్తర ఘట్టానికి బ్రహ్మోత్సవం. యుగయుగాలుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని పురాణాలు చెపుతున్నప్పటికీ...శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరో శతాబ్దంలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 15వ శతాబ్దం వరకు శ్రీవారికి ఈ వేడుకలు అప్పుడప్పుడు జరిగేవట. రాయల వారి కాలం నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. కాలక్రమేణా ఎందరో రాజులు తమ శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారట. క్రీ.శ.614లో పల్లవరాణి సామవై... ఆలయానికి స్వామివారి వెండి విగ్రహాని సమర్పించింది. పెరటాసి మాసం అంటే కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించేట్లు ఏర్పాటు చేసిందట. ఆ తరువాతా క్రీ.శ.1254 చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ.1328లో ఆషాడ మాసంలో ఆడితిరునాళ్ళను త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధ యాదవరాయులు, క్రీ.శ.1429లో అశ్వయుజ మాసంలో వీరప్రతాపదేవరాయులు, క్రీ.శ.1446లో మాసి తిరునాళ్ళ పేర హరిహరరాయులు, క్రీ.శ.1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవం గా అచ్యుతరాయులు, ఇలా క్రీ.శ.1583 నాటికి బ్రహ్మోత్సవాలు ఇంచుమించు ప్రతినెల జరుగుతుండేవట. కృష్ణదేవరాయుల కాలంలో ఏడాదికి 15 బ్రహ్మోత్సవాలు జరిగినట్లు కూడా ఆధారాలున్నాయి.
ఇక శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవంగా భక్తులు పాల్గొనేవి శ్రద్దా బ్రహ్మోత్సవాలు. ఈ వేడుకలకు సకల దేవతలు, అష్టదిక్పాలకులు, రాక్షస, గంధర్వలందరూ వస్తారన్ని ఆగమశాస్త్రం చెప్తోంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో తిరుమలేశుని దర్శనం మహాభాగ్యం. రాజులు, వారి రాజ్యాలు కాలగర్భంలో కలసి పోయాక వారు ఏర్పాటు చేసిన ఉత్సవాలు లిచిపోయాయి. కానీ ఆనాడు శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు లోకకళ్యాణార్ధం కోసం బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా.. అంగరంగ వైభవంగా కోనసాగుతూనే ఉన్నాయి. కోండలరాయుని కోండంత వైభవాని దశదిశలా చాటేలా నిర్వహిస్తూనే వుంది టీటీడీ.
బ్రహ్మదేవుడు స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూన్నాడు అనట్లుగానే.. ఇప్పటికీ స్వామి వారి వాహన సేవలు జరిగే సమయంలో ముందుగా బ్రహ్మరధం వెలుతూ ఉంటుంది. ఈ రథంలోనే నిరాకర రూపుడైన బ్రహ్మదేవుడు వేంచెసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడట. ఇక రథోత్సవం నాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి పగ్గాలను పట్టుకుని లాగుతు రథోత్సవంలో పాల్గోంటారట. అందువల్లే ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా పిలుస్తూ...అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజాఅవరోహణంతో ముగుస్తాయి. చాంద్రయానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సంధర్భాలలో కన్యామాసంలో ఒక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో మరో బ్రహ్మోత్సవం...ఇలా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో అంటే కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలని, నవరాత్రులలో నిర్వహించే ఉత్సవాలును నవరాత్రి బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం... ధ్వజాఅవరోహణం వుండదు. అలాగే ఎనిమిదో రోజున నిర్వహించే రథోత్సవం ఉండదు. రథోత్సవం బదులుగా స్వర్ణ రథం ఊరేగింపు నిర్వహిస్తారు. మొదటి బ్రహ్మోత్సవాని శాస్ర్తియంగా నిర్వహిస్తే..రోండో బ్రహ్మోత్సవాన్ని అలంకారప్రాయంగా నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో... ఏఏ రోజు ఏఏ ఉత్సవాలు.. వాటి విశిష్టతలు
అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు స్వామి వారి సర్వసేనాధిపతి అయిన విష్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి నైరుతి మూలన ఉన్న వసంత మండపానికి ఛత్రచామర మంగళవాద్యలు, వేదమంత్రోచ్చారణలు మధ్య చేరుకుంటాడు. అక్కడ భూమి పూజ నిర్వహిస్తారు. పుట్టుమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకుంటారు.ఆ రాత్రే బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది. నవధాన్యాలు ఎంత బాగా పెరిగితే రాష్ర్టం, దేశం అంత సుభిక్షంగా వుంటాయని విశ్వాసం.
బ్రహ్మండనాయకుడి బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు స్వామివారు ఊరేగే వాహనం పెద్దశేష వాహనం. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్ననాయణుడికి ఎంతో సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. కలియుగంలోనూ శేషుడు గోవిందరాజస్వామిగా స్వామివారికి సన్నిహితంగా ఉన్నారు. పెద్దశేష వాహనం సేవను దర్శించుకుంటే భక్తుల్లో పశుత్వం పోయి.. మానవత్వం, దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని విశ్వాసం.
రెండోవ రోజు ఉదయం శ్రీవారు చిన్నశేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేష వాహానాన్ని ఆది శేషుడుగాను.. చిన్న శేష వాహనాన్ని వాసుకిగా భావిస్తారు భక్తులు. చిన్నశేష వాహనంపై మలయప్పస్వామి మాత్రమే ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు. చిన్నశేషవాహనంపై ఊరేగుతున్న స్వామి వారిని దర్శించుకుంటే భక్తులకు యోగ సిద్ధి ఫలం లభిస్తూందని నమ్మకం. రెండోవ రోజు రాత్రి మలయప్పస్వామివారు వీణాపాణియైన సరస్వతి మూర్తిగా హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మవాహనంగా హంస ప్రసిద్ధి. అటువంటి హంసను తన వాహనంగా చేసుకోని మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారు శ్రీవారు. హంస వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే అహంభావం తొలగి దాసోహం అనే భావం కలుగుతుదంని భక్తుల విశ్వాసం. మూడోవ రోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంత తేజోమూర్తియైన శ్రీనివాసుడు రాక్షసుల మనస్సులో సింహంలా గోచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. భగవంతుని అవతారాల్లో నరసింహ అవతారం నాలుగోది. ధర్మరక్షణకై నరసింహ స్వరూపాని ధరించిన స్వామివారు ఈ ఉత్సవాల్లో సింహాన్ని అధిష్టించి రావడం దుష్టశిక్షణ-శిష్ట రక్షణకు సంకేతమని చెప్తారు. సింహం పరాక్రమం కలిగిన జంతువు. అది మదగజాలనే సంహరించగలదు. అలాంటి సింహానే తన వాహనంగా స్వామివారు చేసుకోవడం అంటే స్వామివారు ఎంతటి పరాక్రమం కలిగినవారో అర్ధమవుతుంది అంటారు పండితులు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగివునప్పుడు...భగవంతుడు భక్తుని అనుగ్రహిస్తాడు అన్నది సింహ వాహన సేవలో అంతరార్ధం అంటారు అర్చకులు.
మూడోవ రోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి దర్శనమిస్తారు. ముత్యాలు విలువైనవి... చల్లదనాని ప్రసాదిస్తాయి. తెల్లని కాంతులును ఇస్తాయి. సముద్రం మనకు ప్రసాదించిన మేలిమి వస్తూవుల్లో ముత్యం ఒక్కటి. ఇంత ప్రాశస్తమైన ముత్యాలను పందిరిగా రూపొందించిన వాహనంలో ఏడుకోండల స్వామి ముచ్చటగా ఊరేగుతాడు. చల్లని ముత్యాల క్రింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలును పోగోట్టి, భక్తుల జీవితాల్లో చల్లదనాన్ని సమకూరుస్తుందని భక్తుల విశ్వాసం.
బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు. కల్పవృక్షం వాంఛిత ఫలాలు అన్నింటిని ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనంపై అధిరోహించిన శ్రీనివాసుడిని.. భక్తులు తనివితీరా దర్శించుకుంటారు. కల్పవృక్ష వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు సిద్ధిస్తారని భక్తుల నమ్మకం. నాలుగో రోజు రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానకి వరుణుడు, వాయవ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదికాల్పులై విరాజిల్లుతు వుంటారు. వీరంతా స్వామివారిని సుప్రభాతం సేవ సమయంలో సేవిస్తారని స్వామి తెలియజేసారు. ఇక భూపాలకులందరు అధికార సంపన్నులే.... వారి అధికారం దుర్వినియోగం కాకూండా వుండాలంటే వారు భగవతుని సేవాపరులై వుండాలి. అలా వారంతా శ్రీవారిని తమ భుజస్కంధాలుపై మోస్తారని ప్రతీతి. స్వామివారి సర్వభూపాల వాహనంపై దర్శించుకుంటే రాజ్యసుఖప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వాసం.
ఐదోవ రోజు ఉదయం ఆపద మొక్కులవాడు మోహిని అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనం ఉరేగింపు వాహన మండపం నుండి ప్రారంభమైతే.... ఒక్క మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ఆలయం నుండి బంగారు తిరుచ్చిపై మోహిని అవతరాంలో స్వామివారు... ప్రక్కనే దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో స్వామివారు వెలుపలికి వచ్చి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మోహిని అవతరాంలో మరో ప్రత్యేక అలంకరణ వుంటుంది. స్వామివారికి శ్రీవల్లి వూత్తురు నుంచి గోదాదేవికి అలంకరించిన పుష్ప మాలాలు, చిలుకలును స్వామివారికి అలంకరిస్తారు. జగత్తు అంతా మాయా మోహానికి లోంగి వుంటుంది. ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయుడే. బ్రహ్మోత్సవాల్లో మోహిని రూపధారియైన స్వామివారు... ప్రపంచమంతా తనమాయా విలాసమని... తన భక్తులు ఈ మాయాను సులభంగా దాటగలరని చేబుతున్నట్టుగా ఉంటుందని అంటారు. ఐదోవ రోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహన సేవను దర్శించుకునేందుకు లక్షల మందికి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి వాహన సేవలలో గరుడ వాహనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనం సంధర్భముగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించే మకర కంఠి,లక్ష్మికాసుల హరం,సహస్రనామ మాలలను స్వామివారి ఉత్సవమూర్తులుకు అలంకరిస్తారు. శ్రీవల్లి పుత్తూరు దేవస్థానం తరపున తులసి మాలలు, చెన్నై భక్తులు సంప్రదాయబద్ధంగా సమర్పించే నూతన గోడుగులును స్వామివారికి అలంకరిస్తారు. గరుడను వాహనంగానే కాకుండా ధ్వజారోహణం రోజున ధ్వజ మండపంపై నిలిచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలును ఆహ్వనిస్తాడు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు పర్యవేక్షిస్తాడు. అంతటి ప్రాముఖ్యత కలిగిన గరుడ వాహన సేవను దర్శించుకున్న భక్తులకు జ్ఞానముతోపాటు వైరాగ్యప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఆరోవ రోజు ఉదయం హనుమంత వాహనం. భగవంతుని భక్తులలో హనుమంతుడు అగ్రగణ్యుడు. హనుమంతుడు తన వీపుపై వేంకటాద్రిని మోస్తూ.. మాడ వీధులలో విహరిస్తారు. ఇక.. పుష్పపల్లకీ సేవ అత్యంత వేడుకగా జరుగుతుంది.. రుక్మిణి, సత్యభామ సమేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో మలయప్పస్వామి వారు పుష్పక విమానంలో భక్తులకు దర్శనమిస్తారు. పుష్పక విమాన సేవను అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మాత్రమే టీటీడీ నిర్వహిస్తుంది. ఆరు రోజులుగా వివిధ వాహనాలపై కొలువుదీరుతూ అలసిపోయే స్వామి,అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేసి భక్తులకు దర్శనమిస్తారు.. ఆరోవ రోజు రాత్రి శ్రీవారు గజవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
ఏడోవరోజు ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనం అధిష్టించి తేజో విరాజితుడై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారుకుడు...ప్రకృతికి చైతన్యప్రదాత. అట్టి సూర్యప్రభను స్వామివారు తన వాహనంగా చేసుకుని మాడవీధుల్లో విహరిస్తారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే భక్తులుకు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్మకం. ఏడోవ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు.... ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీహరి రాత్రి నిశాకరుడైన చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. చంద్రప్రభ వాహనంపై స్వామివారిని చూడగానే భక్తుల మనస్సు ఉప్పోంగుతుంది. చంద్రుని వల్ల ఆనందం,చల్లదనం కలుగుతుంది.అదే విధంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక మనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.
8వ రోజు ఉదయం స్వర్ణరథ ఊరేగింపు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన స్వర్ణ రథంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తిరు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.74 కేజిల బంగారం,2900 కేజిల రాగి, 25 టన్నుల చెక్కతో తయ్యారు చేసిన 32 అడుగుల పోడవైన అతిపెద్ద స్వర్ణ రథం అది. 8వ రోజు రాత్రి కల్కి అవతారంలో శ్రీవారు అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి చివరి వాహన సేవ అశ్వ వాహనం. భగవంతుని అవతారాలలో పది ప్రసిద్ధమైనవి. చివరి అవతారం కల్కి అవతారం. కలియుగాంతంలో కల్కి రూపధారియైన స్వామివారు కత్తి చేతభూని అశ్వ వాహనంపై దుష్ట సంహారం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి.
బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం 9వ రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహిస్తారు. యజ్ఞం చివర అవభృధస్నానం నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజులు పాటు ఒక యజ్ఞంలా నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చక్రస్నానం ఉంటుంది. పుష్కరిణి దగ్గర ఉన్న మండపంలో ముందుగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రత్తాల్వారుకు పుష్కరిణిలో అవభృధస్నానం ఆచరిస్తారు. వేలాది మంది భక్తులు ఆ సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. అదే రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరగడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.