Google Chrome: ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-In) హెచ్చరికలు  జారీ చేసింది. పాత గూగుల్ క్రోమ్ వాడుతుంటే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. గూగుల్ క్రోమ్‌లో హై సెక్యూరిటీకి సంబంధించిన అనేక లోపాలు ఉన్నట్లు పేర్కొంది. ఇది రిమోట్ ఎటాకర్‌ దాడులను  సహకరించేలా అనేక లోపాలు ఉన్నాయని తెలిపింది.  సైబర్ నేరగాళ్లు మీ కంప్యూటర్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేసేలా అనేక భద్రతా లోపాలు ఉన్నాయని పేర్కొంది. 


ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన, ఎక్కువ మంది ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్‌గా గూగుల్ క్రోమ్ (Google Chrome) గుర్తింపు పొందింది. టెక్ దిగ్గజం గూగుల్, ఈ బ్రౌజర్‌ను సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అయితే యూజర్ల భత్రకు సవాళ్లుగా మారే కొన్ని వల్నరబిలిటీస్‌ గురించి ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థలు ప్రజలను హెచ్చరిస్తుంటాయి. తాజాగా గూగుల్ క్రోమ్‌లో బయటపడిన సెక్యూరిటీ రిస్క్‌ గురించి దేశ ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన వల్నరబిలిటీ నోట్‌లో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ పేర్కొంటూ.. రిమోట్ అటాకర్ క్రోమ్ లోని లోపాలను ఆయుధంగా చేసుకుని టార్గెటెడ్ సిస్టమ్‌పై దాడి చేయవచ్చని తెలిపింది. వాటిని నివారించడానికి  వెంటనే అప్‌డేట్‌లను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది. 


గూగుల్‌ క్రోమ్‌ విండోస్‌ వెర్షన్‌ 118.0.5993.70/.71.. మ్యాక్‌, లైనక్స్‌ వెర్షన్‌ 118.0.5993.70 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందని కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆయా బ్రౌజర్లలో లోపాల కారణంగా రిమోట్‌గా దాడి చేసే వ్యక్తి.. సిస్టమ్‌లోకి ఆర్బిట్రరీ కోడ్‌లను జొప్పించవచ్చని, సర్వీస్‌లను తిరస్కరించడం (DoS), టార్గెటెడ్ సిస్టమ్‌లలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే  ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాబట్టి వెంటనే గూగుల్‌ క్రోమ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.


ఆగస్టులోనూ హెచ్చరించిన CERT-IN
గత ఆగస్టు నెలలో సైతం కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా గూగుల్ క్రోమ్‌లో లోపాల గురించి ప్రస్తావించింది. గూగుల్‌ క్రోమ్‌ విండోస్‌, మ్యాక్‌, లైనక్స్‌, బ్రౌజర్లను వినియోగిస్తున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందని కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మల్టిపుల్ వర్నలబిలిటీస్, సెక్యూరిటీ రిస్క్‌లు ఉన్నాయని ఆగస్టు 9న యూజర్లను హెచ్చరించింది. వీటితో రిస్క్ ఎక్కువగా ఉంటుందని కూడా అలర్ట్ చేసింది. అందుకే వీలైనంత త్వరగా యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది


క్రోమ్ అప్‌డేట్ చేసుకోండి ఇలా..
CERT-IN హెచ్చరికల నేపథ్యంలో గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోంది. మీరు గూగుల్‌ క్రోమ్‌ ఏ వెర్షన్‌ వాడుతున్నారో తెలుసుకోవాలంటే బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయండి. కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేస్తే సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. అందులో ‘అబౌట్‌ క్రోమ్‌’ అనే ఆప్సన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే బ్రౌజర్‌ ప్రస్తుత వెర్షన్‌తో పాటు అప్‌డేట్‌ అయిందా? లేదా? అనేది చూపిస్తుంది. ఒకవేళ బ్రౌజర్‌ అప్‌డేట్‌ కాకుంటే అప్‌డేట్ చేసి రీలాంచ్‌ చేయాలి. లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ అయ్యి ఉంటే ‘క్రోమ్‌ ఈజ్‌ అప్‌ టూ డేట్‌’ అని కనిపిస్తుంది.