టీటీడీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటుచేశామని ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ సీనియర్ అధికారులతో ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలు సమావేశం అయ్యారు. అనంతరం టీటీడీ‌ ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను నిపుణుల ద్వారా గుర్తించి వాటికి మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ పై కమిటీని నియమించామని, బయోడిగ్రేడబుల్ లడ్డూ కవర్లను ప్రవేశపెట్టామన్నారు. త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జన్మస్థలం అభివృద్ది చేస్తామని, అక్కడ ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9:30 గంటలకు భూమి పూజ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ బృందవనం పనులు ఫిబ్రవరి16న ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి 15న తర్వాత ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. స్వామి వారి సేవలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ ను ఉపయోగించాలని, నకిలీ సైట్లను నమ్మి భక్తులు మోసపోవద్దని ఆయన భక్తులను కోరారు. మార్చి 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిచ్చే అవకాశం ఉందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో తితిదే ఈవో జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 


పలుమార్లు వాయిదా 


కరోనా కారణంగా తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి నిలిపివేశారు. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావన ఉంది. కోవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని టీటీడీ చెబుతోంది. సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించింది టీటీడీ.  కానీ కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్న కారణంగా ప్రస్తుతం ఆన్ లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు చేశారు. ఆ తర్వాత సర్వదర్శనం ఆఫ్ లైన్ టోకెన్లు జారీ చేస్తామని చెబుతోంది. 


Also Read: ఉద్యోగుల డిమాండ్లపై మెత్తబడుతున్న ఏపీ ప్రభుత్వం.. కొత్త ప్రతిపాదనలతో చర్చలు ప్రారంభం !