ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్ డౌన్ చేయడం ప్రారంభించారు. రెండు రోజుల పాటు సహాయ నిరాకరణ చేసి సోమవారం నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంత కాలం ఉద్యోగుల డిమాండ్లను అసలు పట్టించుకోనట్లుగా ఉన్న ప్రభుత్వం హఠాత్తుగా మనసు మార్చుకుంది. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో కొన్ని నెరవేరుస్తామంటూ చర్చలకు పిలిపిచింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా రాత్రి పూట కూడా సచివాలయానికి వచ్చి మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ విజయవంతం కావడంతో సర్కార్ తీరు కాస్త మారినట్లు కనిపిస్తుంది. ఏపీ మంత్రుల కమిటీ చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లో మార్పులకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. అదనపు క్వాంటమ్ పింఛను, ఇతర అంశాల్లో మార్పులు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెండు లక్షల వరకు జనాభా ఉంటే 8 శాతం హెచ్‌ఆర్‌ఏ, 2-5 లక్షల జనాభా ఉంటే 12 శాతం, 5-15 లక్షల మధ్య జనాభా ఉంటే 16 శాతం, 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 24 శాతం హెచ్‌ఆర్‌ఏను మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. అదనపు క్వాంటం పింఛన్‌లో 70 ఏళ్ల వారికి 5 శాతం, 75 ఏళ్ల వారికి 10 శాతం ఇస్తామని కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. సీపీఎస్ రద్దుపై మరో మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగులతో చర్చించనుందని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదనలపై నిర్ణయం చెప్పాలని ఉద్యోగ సంఘాలను మంత్రుల కమిటీ కోరగా.. చర్చించుకుని చెబుతామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలపై పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు.
ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలి.. ఏపీ ఉద్యోగ నేతల డిమాండ్ !
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విషయంలో వచ్చిన ప్రజాస్పందనను వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించారు. డీజీపీతోనూ అరగంట సేపు మాట్లాడారు. సమ్మె చేస్తే పరస్థితి ఎలా ఉంటుందో ఉన్నతాధికారులతో చర్చించారు. ఆ తర్వాత ఉద్యోగులను సమ్మెకు వెళ్లకుండా చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఉద్యోగులతో చర్చల కోసం నియమించిన మంత్రుల కమిటీని పిలిపించి.. ఉద్యోగులతో మాట్లాడాలని సూచించి పంపారు. ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్ల విషయంలో కొన్ని నెరవేరుస్తామని హామీ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది.
తగ్గని ప్రభుత్వం - పట్టు వీడని ఉద్యోగులు ! సమ్మె ఖాయం.. తర్వాత ఏంటి ?
హెచ్‌ఆర్ఏ విషయంలో మరో రెండు స్లాబ్‌లు పెట్టడం, సీసీఏ పునరుద్ధరించడం, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు రద్దు చేయడం వంటి ప్రతిపాదలను ఉద్యోగ సంఘాల ముందు కమిటీ పెట్టినట్లుగా తెలుస్తోంది. చర్చలకు కమిటీ సభ్యులంతా హాజరయ్యారు. సీఎస్ సమీర్ శర్మతో పాటు మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నాని , ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు.
ఏపీ ఉద్యోగుల పెన్‌డౌన్ స్టార్ట్.. చర్చలకు రావాలని మళ్లీ ప్రభుత్వం పిలుపు !
అయితే ఇప్పటి వరకూ తాము మూడు డిమాండ్లు పెట్టామని.. అవి పరిష్కరిస్తేనే చర్చల ప్రక్రియ ముందుకెళ్తుందని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. మొదటిది అర్థరాత్రి ఇచ్చిన పీఆర్సీ జీవోలను రద్దు చేయడం.. రెండోది పాత జీతాలను ఇవ్వడం.. మూడోది పీఆర్సీ నివేదిక ఇవ్వడం. ఇప్పటికే జీతాలు వేసినా.. వాటిని క్యాన్సిల్ చేసి.. పాత జీతాల లెక్కల ప్రకారం వేయాలని కోరుతున్నారు. ఈ అంశాల్లో ప్రభుత్వ స్పందనను బట్టే వారి కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. తాము ప్రభుత్వం ముందు పెట్టిన అన్ని డిమాండ్లు ప్రధానమైనవేనని.. తమ డిమాండ్లలో మార్పు లేదని స్టీరింగ్ కమిటీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలు శనివారం కూడా కొనసాగించాలనుకుంటే వస్తామని చెబుతున్నారు.