చలో విజయవాడ సక్సెస్ కావడంతో  ఉద్యోగులు ఉత్సాహంగా మరింత జోరుగా పోరాటాన్ని చేస్తున్నారు. శనివారం నుంచి పెన్ డౌన్ చేసి..  ఏడో తేదీ నుంచి సమ్మె చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే శని, ఆదివారాలు సెలవు కావడంతో ప్రత్యేకంగా పెన్ డౌన్ చేసే అవకాశం ఉండదన్న ఉద్దేశంతో ఉద్యోగులు ఒక రోజు ముందుగానే పెన్ డౌన్, సిస్టండౌన్, యాప్ డౌన్ చేశారు. శుక్రవారం రోజు ఏపీ సచివాలయం ఉద్యోగులు సహాయనిరాకరణ చేస్తున్నారు. ఏ విభాగంలోనూ పనులు చేయడం లేదు. జిల్లాల్లో మాత్రం కొంత మంది పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


ఉద్యోగులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వారిని చర్చలకు పిలుస్తూనే ఉంది. చలో విజయవాడ సక్సెస్ కావడంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు పిఆర్సి  సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. చలో విజయవాడ జరిగిన వైనంపై సమీక్ష నిర్వహించుకున్నారు. ప్రభుత్వంపై పోరుబాటలో ప్రతి ఒక్క ఉద్యోగి అండగా నిలిచారని .. వారి ఆకాంక్షల మేరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం శుక్రవారం కూడా ఉద్యోగులు చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. ఈ అంశంపైనా స్టీల్ కమిటీ చర్చించింది.


చర్చలు ముందుకు సాగాలంటే పీఆర్సీ జీవోల రద్దుతో పాటు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాత్రం చర్చలకు రావాలని అంటోంది కానీ తాము తీసుకునే చర్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది . దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది. శని, ఆదివారాలు సెలవు రోజులు.. ఇక సోమవారం నుంచి సమ్మె చేయాలని నిర్ణయించడంతో ఏపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మె చేస్తామని చెబుతూండటంతో ప్రభుత్వ వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


సమ్మె చేయవద్దని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను కోరుతోంది. కానీ సమ్మెను ఆపేందుకు గట్టి చర్యలు చేపట్టడం లేదు. అయితే సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సమ్మె విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అన్ని శాఖల ఉద్యోగులకూ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించడంతో ప్రభుత్వ వ్యవ్సథలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో  సమ్మె జరగకుండా ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు సానుకూలంగా ఓ నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది .