యాంగ్రీ స్టార్ రాజశేఖర్, ఆయన భార్య జీవిత, పిల్లలు శివాని - శివాత్మిక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ మినహా మిగతా వాళ్ళు త్వరగా కోలుకున్నారు. ఆయనకు మాత్రం సీరియస్ అయ్యింది. ఐసీయూలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ టీవీ కార్యక్రమంలో కరోనా కాలంలో తాను చచ్చిపోతానని అనుకున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ రోజు (శుక్రవారం, ఫిబ్రవరి 4న) పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకల్లో మరోసారి ఎమోషనల్ అయ్యారు.
"కొవిడ్ టైమ్‌లో బతుకుతానా? లేదా? అనిపించింది. నా జీవితం అయిపోయిందని అనుకున్నా. సినిమాలు చేస్తానా? లేదా? అనుకున్నాను. ఎందుకంటే... ఆస్పత్రిలో లేవలేక, నడవలేక దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. అయితే... ఇవాళ నేను మీ ముందు ఇలా నిలబడ్డానంటే కారణం మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమే. మీ అందరికీ ధన్యవాదాలు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత 'శేఖర్' సినిమా చేశా. పది సినిమాలకు పడిన కష్టం ఈ ఒక్క సినిమాకు పడ్డాం. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి సినిమా చేశారు. 'శేఖర్' బాగా రావడానికి కారణం జీవిత. తను వెనుకుండి మమ్మల్ని ముందుకు నడిపించింది" అని రాజశేఖర్ చెప్పారు.
రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా 'శేఖర్' సినిమాలో 'కిన్నెర...' పాటను శుక్రవారం విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతంలో అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు. రాజశేఖర్, 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్ మీద ఈ పాటను చిత్రీకరించారు.
దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "గత ఏడాది 'శేఖర్' సినిమా చేద్దామని అనుకున్నప్పుడు రాజశేఖర్ గారికి కరోనా వచ్చింది. అప్పుడు పుట్టినరోజు కూడా జరుపుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ పుట్టినరోజుకు 'కిన్నెర...' పాటతో మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పూర్తి చేయడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. అలాగే, రాజశేఖర్ గారు ఆరోగ్యంగా ఉండాలని స్నేహితులు, బంధువులు, అభిమానులు పూజలు చేశారని విన్నా. వారికీ థాంక్స్. ఆల్రెడీ విడుదల చేసిన 'లవ్ గంటే'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'కిన్నెర...'కూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ వస్తుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు. 'కిన్నెర...' హార్ట్ టచింగ్ సాంగ్ అని అనూప్ రూబెన్స్ చెప్పారు.
రాజశేఖర్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన కుమార్తె శివాని, నటులు సమీర్, భరణి శంకర్, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్-ప్లే సమకూర్చిన 'శేఖర్' సినిమాను వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు.