New Trains in AP: రాష్ట్రంలో ఈ నెల 12 (శుక్రవారం) నుంచి 3 కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. రైల్వే శాఖ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి వీటిని పట్టాలెక్కించనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీటిని ప్రారంభించనున్నారు. హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖ - గుంటూరు, నంద్యాల - రేణిగుంట రైళ్లను శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. వెను వెంటనే ఈ రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.


సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు


అటు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే ప్రకటించింది. ఇప్పటికే 32 ప్రత్యేక సర్వీసులు సహా మరో 5 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ బుధవారం మరో 5 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. కాచిగూడ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, H.S నాందేడ్ - కాకినాడ టౌన్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. 


ప్రత్యేక రైళ్ల వివరాలివే..



  • 07041 కాచిగూడ - తిరుపతి రైలు జనవరి 12న (శుక్రవారం) రాత్రి 08:25 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 09.00కు తిరుపతి చేరుతుంది. 

  • 07042 తిరుపతి - కాచిగూడ రైలు ఈ నెల 13న (శనివారం) రాత్రి 7.50 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 08.50 కు కాచిగూడ చేరనుంది.

  • 07060 తిరుపతి - సికింద్రాబాద్ రైలు ఈ నెల 12న (శుక్రవారం) రాత్రి 8.25 గంటలకు బయలేదరి శనివారం ఉదయం 09.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

  • 07487 H.S నాందేడ్ - కాకినాడ టౌన్ ఈ నెల 15న (సోమవారం) మధ్యాహ్నం 2.25 గంటలకు నాందేడ్ లో బయలుదేరి మంగళవారం ఉదయం 08.10 గంటలకు కాకినాడ చేరనుంది.

  • 07488 కాకినాడ టౌన్ – H.S నాందేడ్ రైలు ఈ నెల 16న (మంగళవారం) సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్ చేరుతుంది. అని అధికారులు తెలిపారు.


సంక్రాంతికి ప్రత్యేక బస్సులు


మరోవైపు, ఏపీఎస్ఆర్టీసీ సైతం సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌(Hyderabad) నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు అదనంగా వెయ్యి సంక్రాంతి స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్‌(Sankranti) కింద 6,725 బస్సులను నడపాలని నిర్ణయింది. అందులో హైదరాబాద్‌ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్‌ సర్విసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్‌ సర్విసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూ­లు, అనంతపురం, తిరుపతి, నెల్లూ­రు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్వీసులు నడుపనున్నట్లు చెప్పారు. అలాగే బెంగళూరు, చెన్నైల నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు­లు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామని, ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు అన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌లోని పలు పాయింట్లలో సూపర్‌వైజర్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల సమాచారం కోసం, ఏవైనా సమస్యలు ఉన్నా కాల్‌ సెంటర్‌ నంబరు 149కి గానీ, 0866-2570005కు గాని ఎప్పుడైనా ప్రయాణికులు ఫోన్‌ చేయవచ్చని వెల్లడించారు. ఈ నెల 18 వరకు ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని స్పష్టం చేశారు.


Also Read: Jagananna Thodu Scheme: 'జగనన్న తోడు పథకం దేశానికే ఆదర్శం' - వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్