Gorantla Madhav: ఇవాళ అనంతపురం జిల్లా  గోరంట్ల మండలం పాలసముద్రంలో నాసిన్(నేషనల్ అకాడమీ ఆప్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కొటిక్స్)అకాడమీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శంకర్ నారాయణ పేరు కూడా ఇన్విటేషన్ లో ప్రచురించలేదు. ఇదే విధంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు కూడా ఇన్విటేషన్ లో లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వీటంన్నిటిపై ఎంపీ మాధవ్ ఫైర్ అయ్యారు. స్థానిక నేతలైన తమ పేర్లు ఎందుకు ప్రచురించలేదని నాసిన్ అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తే వారి నుంచి ఏ మాత్రం స్పందన లేదు. జరిగిన తప్పును శిలాఫలాల రూపంలో సరిదిద్దామని నాసిన్ అధికారులు చెప్పినప్పటికీ ఇన్విటేషన్లో జరిగిన అవమానాన్ని గోరంట్ల మాధవ్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. 



మంత్రి శంకర నారాయణ పేరు కూడా లేకపోవడంతో 


మంత్రి శంకర నారాయణకు కూడా ఇదే అవమానం జరిగిందని, అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. వీటిపై నిర్మలా సీతారామన్ కూడా ఆరా తీసినట్లు తెలిసింది. అయితే మంత్రి బహిరంగంగా ఎంపీ మాధవ్ ఫిర్యాదుపై స్పందించలేదు. ఈ ప్రాంతానికి నాసిన్ వల్ల జరిగే అభివృద్ధి మాత్రమే వివరించారు. ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రసంగానికి చలించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికిప్పడు ఆంద్రప్రదేశ్ కు ఏమీ చేయలేనప్పటికీ ముఖ్యమంత్రి జగన్ అడుగుతున్న ప్రతిదానికి వీలైనంత వరకు నిబంధనలకు అనుగుణంగా నిధులు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను సొంత బిడ్డగా ప్రధాని మోదీ చూస్తున్నారంటూ ప్రసంగించి వైసీపీ నేతల అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు నిర్మలా సీతారామన్. 


సాయంత్రానికి కూల్ అయిన ఎంపీ మాధవ్ 


రానున్న రోజుల్లో మరిన్ని నిధులిస్తామని, ఏడారిగా మారుతున్న అనంతపురం జిల్లాను ఆదుకొంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నాసిన్ అకాడమీని ఈ ప్రాంతంలో స్థాపించడం ద్వారా అభివృద్ధ్, మౌలికవసతుల కల్పన మరింత మెరుగుపడుతాయని తెలిపారు. కానీ ఎక్కడా ప్రోటోకాల్ విషయంపై కేంద్ర మంత్రి నోరు విప్పలేదు. ఈ విషయంపై తాము ఫిర్యాదు చేశామని ఎంపీ మాధవ్ చెప్పినప్పటికీ చివర్లో దీనికి అంత ప్రాధాన్యత  ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు ఎంపీ మాధవ్. తమ పేర్లు లేవని చాలా బాధగా అనిపించినప్పటికీ ఇంత పెద్ద అకాడమీ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం హాట్ హాట్ గా కనిపించిన గోరంట్ల మాధవ్ ప్రోగ్రాం ముగిసేసరికి కూల్ అయ్యారు.