Janasena Yuvasakti: యువత సమస్యలపై గళమెత్తేందుకు జనసేన ఆధ్వర్యంలో యువశక్తి బహిరంగసభను నిర్వహించడాన్ని   జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ బహిరంగ సభ కోసం జనసేన పార్టీ విస్తృత ఏర్పాట్లను చేస్తోంది.  మన  యువత, మన భవిత పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా దానికి కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఈ సభ ప్రారంభం కానుంది. యువతతో మాట్లాడించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. 


యువతను మేల్కొలిపేలా యువశక్తి సభ : నాదెండ్ల మనోహర్  


వర్తమాన రాజకీయాల్లో మార్పు కోసం జనసేన ప్రయత్నం చేస్తుందని అందుకే యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.  ఉత్తరాంధ్ర సమస్యలు, వనరులు, స్థానిక నాయకత్వ వైఫల్యంపై చర్చిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార యువతలో యువశక్తి భరోసా నింపుతుందన్నారు. జగన్ బటన్ నొక్కి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, యువత సమస్యలపై రాజకీయ తీర్మానాలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరు వనరులు దోచుకొని.. నాయకత్వాన్ని ఎదగనీయకుండా రాజకీయం చేస్తున్నారని ఏపీలో ఉపాధి, పెట్టుబడులు ఏమాత్రం లేవని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగం మరింత పెరిగిందని పేర్కొన్నారు.  తమ సభకు వివేకానంద వికాశ వేదికగా నామకరణం చేశామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.   జనసేన పార్టీ అధికారంలోకి రాగానే.. తమ పాలసీ విధానం ఏ విధంగా ఉండబోతుందన్నది తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సమష్యలు, యువత సమష్యలపై రెండు రాజకీయ తీర్మానాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో బటన్‌ నొక్కుడు తప్ప.. అభివృద్ధి ఏమీ లేదని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మత్స్యకారులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని, మత్స్యకార భరోసాలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. వర్గానికో, కులానికో కాకుండా ప్రజల కోసం తమ పార్టీ పని చేస్తుందన్నారు.


మంత్రులకు విమర్శించడం తప్ప మరో పని లేదు : నాగబాబు


 మంత్రులకు తాము చేయాల్సిన పని వారు చేయడం లేదని నాగబాబు  విమర్శించారు. విమర్శించడం తప్ప వారికి మరో పని లేదన్నారు.  అలోచన, ఆవేదన చెప్పడానికి యువశక్తి సభ మంచి అవకాశమని నాగేంద్రబాబు అన్నారు.  యువత చాలా పవర్‌ఫుల్ అని, ఈ సభను యువత ఒక అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం జనసేన పార్టీ కంకణం కట్టుకుందన్నారు. సభకు తాము పెట్టిన రణస్థలం పేరు.. యూత్ పవర్‌కి తగ్గట్టుగా ఉందన్నారు. ఏపీలో ఈరోజు ఉద్యోగాలు గానీ, ఉద్యోగ అవకాశాలు గానీ లేవని మండిపడ్డారు. యువతకు తమ జనసేన పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని భరోసానిచ్చారు. అంతకుముందు జీవో నం.1 తీసుకురావడంపై కూడా నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ జీవోని వెనక్కి తీసుకుంటే మంచిదని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్‌ను ఎంత ఆపితే.. అంతే లెగుస్తారన్నారు. రాజకీయ పార్టీగా తమ జాగ్రత్తలు తాము తీసుకుంటామని, ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.  


యువశక్తి సభకు భారీ ఏర్పాట్లు 
 
 యువశక్తి బహిరంగ సభ నిర్వహించే చోట పెద్ద పెద్ద కటౌట్ లను, ఎయిర్ బెలూన్ లను ఏర్పాటు చేసారు. బహిరంగ సభ ఏర్పాట్లను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో కొంతమంది జనసేన పార్టీ నాయకులు బస చేసి ఏర్పాట్లను చేపట్టారు. వారితో మనోహర్ మాట్లాడి పలు సూచనలు చేసారు. బహిరంగ సభకి విచ్చేసే యువతకి పార్టీ నాయకులు, కార్యకర్తలకి కూడా ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారికి స్పష్టంగా తెలియజేసారు.   యువశక్తి పేరుతో జనసేన పార్టీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు ఈ సభలో ఏ విధంగా స్పందిస్తారోనని ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణస్థలం యువశక్తి సభతో కొత్త రాజకీయం మొదలవుతుందని వారు అంచనా వేస్తున్నారు.