TDP Kondreddy : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నేత కొండ్రెడ్డిని ఆరు నెలల పాటు నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల్ల కురబాల కోటలో జరిగిన రాళ్ల దాడి కేసులో కొండ్రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీంతో ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా... టీడీపీ నేత కొండ్రెడ్డిని నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వెంటనే బహిష్కరణ వేటు పడటంతో కొండ్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్నేళ్లు వైసీపీలో యాక్టివ్ నేతగా కొండ్రెడ్డి ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆయన భార్య గీత జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అనంతర కాలంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో కొండ్రెడ్డికి విభేదాలు మొదలై తారా స్థాయికి చేరుకున్నాయి.
భార్యతో సహా టీడీపీలోకి
గత ఏడాది ఎమ్మెల్యే ప్రోద్బలంతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తన ఇంటి మీద దాడి చేశారంటూ కొండ్రెడ్డి ఆయన భార్య జడ్పీటీసీ గీత బహిరంగంగా విమర్శలు చేశారు. అయితే అదే సమయంలో కొండ్రెడ్డి ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించారని కేసు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2008లో ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి మోసం చేశారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపైన కూడా కేసు నమోదు అయింది. అయితే ఇన్నేళ్లుగా లేని కేసు తాను వైసీపీ నుంచి బయటకు వెళ్లగానే పెట్టారంటూ కొండ్రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. అనంతరం ఆయన భార్యతో సహా టీడీపీలో చేరారు.
కురబాలకోటలో వైసీపీ, టీడీపీ ఘర్షణ
టీడీపీ చేరినప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతగా ఉంటూ పార్టీ కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు కొండ్రెడ్డి. ఇటీవల కురబాలకోటలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలో రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ప్రధాన పాత్ర కొండ్రెడ్డి పోషించారని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో అనవసరంగా ఇరుపార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కొండ్రెడ్డి కుట్ర చేశారని పోలీసులు కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు రాగానే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారన్న కారణంగా కొండ్రెడ్డిని ఆరు నెలల పాటు నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గిరీషా ఉత్తర్వులు జారీ చేశారు.
గూండాగా పరిగణిస్తూ
అన్నమయ్య జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీడీపీ నేత కొండ్రెడ్డి తరచూ గొడవలకు దిగే నేరస్థుడిగా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం-1980 ప్రకారం సెక్షన్ 2(1) కింద ఆయనను గూండాగా పరిగణించవచ్చని నోటీసుల్లో తెలిపారు. గతంలో నమోదైన కేసులను కూడా అధికారులు ప్రస్తావించారు. ఈ నోటీసులపై డిసెంబర్ 27న రాయచోటిలో కలెక్టర్ ఎదుట హాజరైన కొండ్రెడ్డి రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. అనంతరం పోలీసులు ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కొండ్రెడ్డికి బెయిల్ రాగా కడప జైల్ నుంచి ఇటీవల విడుదలయ్యారు. అనంతరం కలెక్టర్ కొండ్రెడ్డిని నియోజకవర్గ బహిష్కరణ ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 6 నెలలపాటు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని ఉత్తర్వుల్లో తెలిపారు. 15 రోజుల్లోగా ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.