Gautam Gambhir:
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. సొంతగడ్డపై అతడు సచిన్ సెంచరీల రికార్డును సమం చేయడం గొప్ప ఘనతగా పేర్కొన్నాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్‌తో కింగ్ కోహ్లీని పోల్చడం సరికాదని వెల్లడించాడు. వీరిద్దరి కెరీర్లలో క్రికెట్ నిబంధనల్లో మార్పులు వచ్చాయని గుర్తు చేశాడు.
గువాహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను 306/8కి పరిమితం చేసింది. 67 తేడాతో విజయ ఢంకా మోగించింది. విరాట్ కోహ్లీ 87 బంతుల్లోనే 12 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ఈ పోరులో విరాట్ తన ఆరాధ్యుడైన సచిన్ తెందూల్కర్ సెంచరీల రికార్డును సమం చేశాడు. సొంతగడ్డపై 20 సెంచరీల రికార్డు అందుకున్నాడు.
కింగ్ కోహ్లీ సెంచరీల రికార్డును ప్రశంసించిన గౌతమ్ గంభీర్ అతడిని సచిన్‌తో పోల్చడం సరికాదని అంటున్నాడు. అప్పటికీ ఇప్పటికీ క్రికెట్ నిబంధనల్లో మార్పులు వచ్చాయని వెల్లడించాడు. 'మీరు సచిన్‌తో విరాట్‌ను పోల్చకూడదు. సచిన్ ఆడుతున్నప్పుడు అంతర్ వృత్తంలో ఐదుగురు ఫీల్డర్లు ఉండేవారు కాదు' అని గుర్తు చేశాడు. తొలి వన్డేలో లంకేయులు తనను నిరాశపరిచారని పేర్కొన్నాడు. వారి బౌలింగ్ చెత్తగా ఉందన్నాడు.
'నిజం చెప్పాలంటే వారి బౌలింగ్ సాధారణంగా ఉంది. టీమ్‌ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో టాప్ 3 ఆటగాళ్లకు ఎంతో అనుభవం ఉంది. రోహిత్, కోహ్లీ ఎన్నెన్ని పరుగులు చేశారో మనకు తెలుసు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు చేయగల సామర్థ్యం శుభ్‌మన్ గిల్‌కు ఉంది. మ్యాచులో రోహిత్, శుభ్‌మన్ ఎంత సులభంగా బ్యాటింగ్ చేశారో మనం చూశాం. అదే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. బౌలింగ్‌లో నిలకడ అవసరం. అందుకే వారి బౌలింగ్ నిరాశపరిచింది' అని గౌతీ వెల్లడించాడు.