AP High court : విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోడికత్తి కేసులో లోతైన విచారణ జరపాలిని బాధితుడు జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో జగన్ సవాల్ చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఎలాంటి కుట్ర కోణం లేదన్న ఎన్ఐఏ
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో తనపై జరిగిన కోడికత్తి దాడి ఘటనకు సంబంధించి లోతైన విచారణ జరపాలన్న అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సీఎం జగన్ సవాల్ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్‌పై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేశారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదుచేశారు. ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఇటీవల సంబంధిత కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చిచెప్పింది. అభియోగాలు నమోదు చేసిన ఎన్‌ఐఏ కోర్టు.. సాక్షుల వాంగ్మూలం నమోదు ప్రక్రియను ప్రారంభించింది.
ఎన్ఐఏ లోతైన విచారణ జరపలేదంటున్న జగన్
కుట్రకోణంపై ఎన్‌ఐఏ కోర్టు లోతైన దర్యాప్తు జరపకుండానే చార్జ్‌షీట్ దాఖలు చేసిందని, ఎన్‌ఐఏ లోతైన దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను ఈ ఏడాది జూలై 25న ఎన్‌ఐఏ కోర్టు తోసిపుచ్చింది. దీంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు నంబరు కేటాయింపుపై రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తగా.. తగిన ఉత్తర్వుల కోసం మూడు రోజుల కిందట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి వద్దకు విచారణకు వచ్చింది. రాష్ట్రంలో ఎన్‌ఐఏ కేసుల విచారణకు కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ 2023, జూలై 24న కేంద్రం గెజిట్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం విశాఖపట్నం పరిధిలో జరిగిన ఘటనలపై విశాఖలోని మూడవ అదనపు జిల్లా కోర్టు/ఏసీబీ కోర్టుకు అధికారాలు దఖలుపరిచారని వివరించారు. విచారణ పరిధి లేకున్నా విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు జూలై 25న అనుబంధ ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ ఉత్తర్వులు చెల్లుబాటు కావని జగన్ తరపు లాయర్ వాదించారు.
ఇప్పటికీ జైల్లోనే నిందితుడు శ్రీనివాసరావు
జగన్ పై కోడికత్తితో దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎుదర్కొంటున్న జనపల్లి శ్రీనివాసరావు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఐదేళ్లుగా ఆయనకు బెయిల్ కూడా లభించడం లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. సీఎం జగన్ కోర్టుకు వచ్చి చెబితే తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని జనపల్లి శ్రీనివాసరావు తల్లిదండ్రులు కోరుతున్నారు.