TDP Leader Narayana :  టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆయన బెయిల్ రద్దు చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టి వేసింది. మళ్లీ లోతుగా విచారించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.  టెన్త్ పరీక్ష పత్రాల లీక్ కేసులో ఆయనను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. దిగువ కోర్టు రిమాండ్ విధించడానికి నిరాకరించి బెయిల్ మంజూరు చేసింది. ప్రశ్నా పత్రాల లీక్ కేసులో నిందితుడని .. పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లో నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేసినట్టు ఆధారాలు చూపించారు. 


బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని ఆదేశించిన చిత్తూరు కోర్టు 


ఈ నిర్ణయంపై ఎగువ కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిగిన చిత్తూరు జిల్లా కోర్టు నారాయణ బెయిల్  రద్దు చేసి..  నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై నారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా నారాయణపై ఎలాంటి చర్యలు వద్దని  ఆదేశాలు జారీ చేసింది. నారాయణ పిటిషన్ పై తీర్పును మాత్రం హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ పై తమ తీర్పు వెలువడే దాకా నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆయనకు రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చిత్తూరు కోర్టు మరోసారి విచారణ జరపనుంది. 


మే పదో తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు ! 


ఆంధ్రప్రదేశ్‌లో  పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్  బ్రాంచీలో  టెన్త్ క్లాస్   తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లీక్‌లకు సూత్రధారి నారాయణ అని.. పోలీసులు కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.   


నారాయణపై పలు కేసులు !


గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణపై ప్రస్తుత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. అమరావతి భూముల కేసులని..అలైన్ మెంట్ కేసులనీ పలు రకాలుగా పెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన రోజే ఆయనపై.. మరో ఎఫ్ఐఆర్ వెలుగు చూసింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో ఆయనపై కేసు నమోదు చేశారు. రెండింటిలో ఏ కేసులో అరెస్ట్ చేశారో స్పష్టత రాలేదు. చివరికి ప్రశ్నాపత్రాల ేకసులో అరెస్టయినట్లుగా తేలడం.. బెయిల్ మంజూరు కావడం జరిగాయి. తర్వాత అలైన్ మెంట్ కేసులోనూ నారాయణ బెయిల్ తెచ్చుకున్నారు. ఆయనను ఇటీవల ఆయనింట్లోనే సీఐడీ ప్రశ్నించింది.