ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారానికి కారణమైన వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత ఆరోపణలు చేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సెక్యూరిటీని ప్రభుత్వం  సమీక్షించి .. మరింత అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించింది. మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం  4 + 4 సెక్యూరిటీ..కాన్వాయ్‌తోపాటు ఉంటుంది. మంత్రి ప్రోటోకాల్‌కు తగ్గట్లుగా ఆయనకు రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు ఆయనకు మరింత భద్రత కల్పించాలని నిర్ణయించారు. మొత్తం 17 మంది భద్రతా సిబ్బందితోపాటు కాన్వాయ్‌లో ఆదనంగా మరో కారును చేర్చాలని నిర్ణయించారు.


Also Read : ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !


ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా భద్రత పెంచారు. ఆయనకు ఇప్పటి వరకూ 1 + 1 సెక్యూరిటీ ఉండేది. ఇక నుంచి ఆయనకు 4 + 4 సెక్యూరిటీని కల్పించనున్నారు. అలాగే అంబటి రాంబాబుతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా సెక్యూరిటీ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వీరంతా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 


Also Read : రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !


చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్‌పై మొదట విమర్శలు, ఆరోపణలు ప్రారంభించింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే. ఆయన ఓ మీడియాకు ఇంటర్యూ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో వైరల్ అయింది.  అసెంబ్లీలో ఈ అంశాన్ని అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ చంద్రబాబు ఉన్నప్పుడే లేవనెత్తి అసభ్యంగా మాట్లాడారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన భార్యను కించ పరచడం తట్టుకోలేక చంద్రబాబు కన్నీరు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు.


Also Read : మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..


చంద్రబాబు సతీమణి ..ఎన్టీఆర్ కుమార్తె కావడంతో  వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆ మాటలన్నవారందరికీ భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.  బెదిరింపులు వస్తున్నాయని అందుకే భద్రత పెంచుతున్నట్లుగా చెబుతున్నారు. 


Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి