ప్రభుత్వం నియమించిన "నచ్చ చెప్పే కమిటీ"తో  సమావేశానికి ఉద్యోగ సంఘ నేతలెవరూ హాజరు కాలేదు. ఫోన్ చేసి పిలిచినా.. జీవోలు ఉపసంహరించుకున్న తర్వాతనే చర్చల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల కోసం కాసేపు ఎదురు చూసిన  కమిటీ సభ్యులు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తమ కమిటీకి చట్టబద్ధత లేదని ఉద్యోగ సంఘాల నేతలు అనడంపై బొత్స మండిపడ్డారు.  జీఏడీ సెక్రటరీ ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి చర్చలకు పిలిచిన తర్వాత కూడా అనధికార చర్చలు ఎలా అవుతాయని మంత్రి సత్యనారాయణ ప్రశ్నించారు. 


Also Read: సారైనా ఆదుకుంటారా ? కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న ఏపీ ప్రభుత్వం !


ఉద్యోగులు చర్చలకు రాకపోవడం సరైంది కాదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు,  చర్చల కమిటీలో భాగమైన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని... ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలు జరపబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం సమస్యను మరింత జఠిలం చేయడమేన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు  కూడా పరిస్థితులను అర్ధం చేసకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. 


Also Read: కుప్పంలో అక్రమ మైనింగ్... చంద్రబాబు ఆరోపణలు నిజమేనా..?... క్వారీలపై అధికారుల వరుస దాడులు


మంగళవారం కూడా చర్చలకు రమ్మని ఉద్యోగ సంఘ నేతలను పిలుస్తామని పీఆర్సీపై అనుమానాలుంటే ప్రభుత్వం నియమించిన కమిటీని అడగవచ్చన్నారు. ఉద్యోగుల ప్రతినిధులు చర్చలకు రేపైనా వస్తారని భావిస్తున్నామన్నారు.  ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదని సజ్జల తెలిపారు.  ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమేరకు మంచి చేశామో తాము చెబుతున్నామని సజ్జల పేర్కొన్నారు.  


Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?


మరో వైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ విడుదల చేశారు.   జీతాలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.. పెంచిన జీతాలు వద్దని ఉద్యోగులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి బహుశా మొదటి సారి అనుకుంటా.. కరోనా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పట్టింపులకు పోకుండా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఉండవల్లి కోరారు.  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి