అమరావతి రైతుల ఉద్యమం 600 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి మొత్తం రణరంగమైపోయింది. పోలీసులు రైతులెవర్నీ బయటకు రానివ్వలేదు. వచ్చిన వారిపై నిర్బంధకాండ అమలు చేశారు. పోలీసులు అమరావతి రైతులపై ఇంత అగ్రెసివ్‌గా ఎందుకు వెళ్లారు.. వారు నిరసన కార్యక్రమాలు చేపడితే ఏమయ్యేది..? ఇది చాలా మందికి వచ్చిన సందేహం. నిజంగానే పోలీసులు అమరావతి రైతులపై అంతగా నిర్బంధం అమలు చేయాల్సిన అవసరం ఏమిటనేది సామాన్యుడికి కూడా సందేహాలు వస్తున్నాయి.
అమరావతి నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం ..!
అమరావతి రైతులు ఒకటి రెండు రోజుల కిందట ఉద్యమాన్ని ప్రారంభించలేదు. 600 రోజుల కిందట ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో వారిపై లాఠీల విరిగాయి. కొందరు రైతుల కేసుల పాలయ్యారు. స్వయంగా ఎస్సీలు అయి ఉండి అట్రాసిటీ కేసులు ఎదుర్కొన్నారు. ఈ మధ్యలో ఉద్యమానికి ఓ బెంచ్ మార్క్ వచ్చినప్పుడల్లా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. కుదిరితే ప్రత్యక్షంగా వస్తున్నారు లేకపోతే వర్చువల్‌గా మద్దతు తెలుపుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ ఇప్పుడు 600 రోజుల ఉద్యమం సందర్భంగా రైతులు చేపట్టాలనుకున్న ప్రదర్శనలపై పోలీసులు మూకుమ్మడిగా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేయడం మాత్రం ఒక్క సారిగా హైలెట్ అయింది.
పోలీసులు సంయమనం పాటిస్తే ఇంత రచ్చ అయ్యేదా..?
మామూలుగా అయితే ఉద్యమాలు, నిరసనలు ప్రజాస్వామ‌్య హక్కు. ఎలాంటి హింసా జరిగే అవకాశం లేనప్పుడు అలాంటి నిరసనలకు అడ్డు చెప్పకూడదు. అమరావతి రైతులు గ్రామాల వారీగా ర్యాలీలు నిర్వహించాలనుకున్నారు. దీనికి అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పోలీసులు తిరస్కరించారు. అంత మాత్రానికే వారు ర్యాలీలు చేయకుండా వందల మంది పోలీసుల్ని దింపాల్సిన అవసరం ఏముంది..? ఏ గ్రామాల వారిని ఆ గ్రామాల్లో కట్టడి చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? ఇతరుల్ని రానివ్వకుండా.. మీడియాను సైతం కట్టడి చేయాల్సినంత ఉద్రిక్త పరిస్థితి అక్క డఎందుకు ఏర్పడింది. రాజధాని రైతులు మహా అయితే ర్యాలీలు నిర్వహించి మీడియాతో మాట్లాడి మళ్లీ శిబిరాలకు వెళ్లిపోయి ఉండే వారు. కానీ ఇప్పుడు పోలీసులు అణిచివేయడానికి ప్రయత్నించడం వల్ల.. అమరావతి రైతుల కష్టం మరోసారి ప్రజల ముందు ఉన్నట్లయింది. ప్రభుత్వంపై మరిన్ని విమర్శలకు ఇది దారితీసే అవకాశం కనిపిస్తోంది.
పోలీసుల తీరు వల్లే అమరావతి ఉద్యమానికి మరింత ఊపు..!
అమరావతి రైతుల నిరసనలను ప్రభుత్వం అడ్డుకుంటుందని .. పోలీసులు ఉక్కుపాదం మోపుతారని ఎవరూ అనుకోలేదు. కానీ ఎవరి సలహాలో కానీ పోలీసులు మాత్రం వందల మంది బందోబస్తుకు వచ్చారు. ఏకంగా ఓ డీఐజీనే అమరావతి పరిసర ప్రాంతాల్లో మకాం వేసి పరిస్థితుల్ని సమీక్షించారంటే.. ప్రభుత్వ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎంత ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం పెరగడానికి కారణం అవుతోంది. ఎలా చూసినా అమరావతి ఉద్యమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే మరింత ప్రాధాన్యత కల్పిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.