Mahanadu News: మహానాడులో రెండు రోజులు గడిచిపోయాయి. కనివిని ఎరుగని స్థాయిలో కడప మహానాడు సక్సెస్ అయిందంటే దానికి తెలుగుదేశం పార్టీ నాయకుల ప్లానింగ్‌తోపాటు వాతావరణ పరిస్థితులు కూడా కారణం. మహానాడుకు ముందు రోజు రాత్రి వర్షం కురిసి నిర్వాహకులను బయటపెట్టినా మంగళవారం తెల్లారేసరికి అంతా సర్దుకుంది. మంగళ బుధవారాల్లో వర్షం కురవలేదు సరికదా రోజంతా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దానితో ఎక్కడెక్కడీ నుంచో వచ్చిన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మహానాడు ప్రాంగణంలో ఉల్లాసంగా గడిపారు. వరుస స్పీచ్‌లు జరుగుతున్నా ఎక్కడా ఇబ్బంది పడలేదు.
గతంలో రాజమండ్రి ఒంగోలు మహానాడు సమయంలో మే నెల ఎండలకు తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కడపలో మామూలుగానే ఎండలు మండిపోతాయి కాబట్టి 2025 మహానాడులో కష్టాలు తప్పవని కొందరు భావించిన మాట వాస్తవం. కానీ విచిత్రంగా వాతావరణం అనుకూలించడంతో ఈ రెండు రోజులు హాయిగానే మహానాడు జరిగిపోయింది. దానితో నిర్వహకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత కీలకమైన మూడోరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహానాడు నిర్వాహకులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు.
5 లక్షల మందితో భారీ సభ ప్లాన్ చేసిన టీడీపీ
పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి కడపలో మహానాడు జరుగుతుండడంతో దీన్ని సూపర్ సక్సెస్ చేయడం కోసం ఆఖరి అంకానికి రెడీ అయింది తెలుగుదేశం పార్టీ. 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను కడపలో జరపడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు ఒక సంకేతాన్ని పంపాలనేది టిడిపి అధినాయకత్వం ఆలోచన. దానికి తగ్గట్టే రాష్ట్రం నలుమూలల నుంచి వారి స్థాయిలో పార్టీ కార్యకర్తలు అభిమానులు కడప చేరుకున్నారు. ఎంత కాదన్నా కనీసం మూడున్నర లక్షల మంది వరకు సభకు హాజరవుతారని అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. మూడో రోజు మహానాడులో వంటలు కోసం దాదాపు రెండు లక్షల మందికి భోజనాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మొదటి రోజున ప్రతినిధుల సభ, లోకేష్ ఆరు శాసనాల ప్రకటన తెలుగు తమ్ముళ్ల రెస్పాన్స్ పరంగా సక్సెస్ అయ్యాయి. రెండో రోజున ఎన్టీఆర్ కు ఘన నివాళి ఇవ్వడంతోపాటుగా మరోసారి పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. ఇక మూడో రోజున భారీ బహిరంగ సభ ఒకటే పెండింగ్ ఉంది. కానీ సరిగ్గా ఇక్కడే వాతావరణ శాఖ సూచనలు ఆర్గనైజర్స్ ను కలవర పెడుతున్నాయి.
రానున్న మూడు రోజులు వానలే వానలు -వాతావరణ శాఖ
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల ప్రకారం గురువారం(29-05-2025) న పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కడపలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. దానితో సభ ఎలా జరుగుతుందో అని తెలుగు తమ్ముళ్లు కాస్త ఆందోళన చెందుతున్నారు. మరోవైపున గడిచిన రెండు రోజుల్లానే గురువారం నాడు కూడా వాతావరణం పూర్తిగా అనుకూలిస్తుందని కచ్చితంగా భారీ బహిరంగ సభ కూడా సక్సెస్ అవుతుందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,ఇతర సీనియర్ నేతలు నిర్వాహకులకు ధైర్యం చెబుతున్నారు.