Relief for Jagan :   అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరల లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన ఎనిమిది నెలల తర్వాత తీర్పు ను ప్రకటించింది. సీఎం జగన్‌కు వ్యక్తిగత  హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఎట్టి  పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించినప్పుడు మాత్రం జగన్ హాజరు కావాలని స్పష్టం చేసింది. 


ఎనిమిది నెలల కిందట తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు 


అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ మొదట సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ కోర్టు తిరస్కరించడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారని..  రోజూ విచారణకు హాజరైతే పాలకు అటంకం కలుగుతుందని జగన్ తరపు లాయర్లు వాదించారు. సీఎం కాకముందు దాదాపుగా ప్రతి వారం హాజరయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇందులో 11 కేసులున్నాయి. వీటిలో కొన్ని 2జీ కేసు కన్నా 5 రెట్లు సంక్లిష్టమైనవి. అందువల్ల విచారణకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రతిసారి హాజరుకావడం సాధ్యం కాదు. ప్రజా విధులు నిర్వహించేవారు నిందితులుగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదంటూ పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు. 


సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించిన సీబీఐ 


అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న  ఏపీ సీఎం జగన్‌ హోదా పెరిగినందున... సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో సీబీఐ కోర్టు నిరాకరించిందని గుర్తు చేశారు. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయన్న సీబీఐ.. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం జరుగుతుందని ప్రస్తావించారు. గత ఏడాది డిసెంబర్‌లో రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత ఇవాళ వెల్లడించారు. 


సీబీఐ కోర్టు ఆదేశించినప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు షరతు


తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులుతో ఏపీ సీఎం కు పెద్ద ఊరట లభించినట్లయింది. అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ ప్రారంభమైతే ఆయన రోజూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆయన ఏపీలో సీఎంగా విధులు నిర్వర్తించడం కష్టమయ్యేది. కేవలం కోర్టుకు సెలవు దినాల్లో మాత్రమే ఆయన ఏపీల ఉండే అవకాశం ఉండేది. అయితే కోర్టు మినహాయింపు ఇవ్వడం.. సీబీఐ కోర్టు అడిగినప్పుడుహాజరు కావాలనే షరతుతో .. ఆయన న్యాయవాది హాజరయ్యేందుకు అంగీకరించడంతో రిలీఫ్ లభించినట్లయింది.   హైకోర్టు తీర్పుతో వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.