Vizag Investers Meet Road show :   విశాఖలో   మార్చ్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లోని  ఐటీసీ కాకతీయ హోటల్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసింది.  హైదరాబాద్ లానే విశాఖపట్నం కూడా  ప్రపంచ ఐటీ డెస్టినేషన్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి గుడివా డ అమర్నాథ్ తెలిపారు.  మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.  విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరుతో పాటు హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఏపీ కలిగి ఉందన్నారు. పారిశ్రామిక కేటాయింపులకు ఏపీలో 48,000 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. దాదాపు 19 రాష్ట్రాలతో పోటీ పడి దక్షిణాదిలోనే బల్క్ డ్రగ్స్ పార్క్ పొందిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పారిశ్రామికవేత్తలకు గుర్తు చేశారు.  


ఏపీలో దిగ్గజ సంస్థలు ఉన్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.  ఆటోమోటివ్‌లో అశోక్ లేలాండ్, కియా, హీరో, ఇసుజు, అపోలో, యోకోహామా, భారత్ ఫోర్జ్ వంటివి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ అండ్ తయారీలో బ్లూ స్టార్, ఫాక్స్‌కాన్, డయాకాన్, పానాసోనిక్, జడ్ టీటీ, ఫ్లెక్స్, వింటెక్ వంటి క్లస్టర్‌లను ఏపీ కలిగి ఉంది. అలాగే మొబైల్ తయారీకి ఏపీ కేంద్రంగా ఉంది.  ఫార్మాస్యూటికల్స్ కు హైదరాబాద్‌తో పాటు ఏపీలో మైనోల్న్, బయోకాన్, లుబెన్, హెటెరో, లూరెస్, దివిస్, ఆరిబిందో, జీ.ఎస్.కె, డాక్టర్ రెడ్డిస్, వంటివి ఉన్నాయి. ఏపీలో వ్యాపార వాతావరణం కోసం సరైన పర్యావరణ వ్యవస్థ ఉందని తెలిపారు. ఇవన్నీ వరుసగా మూడేళ్లపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉండేలా చేసిందని ఆయన గుర్తు చేసారు. రోజుల్లో విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవిస్తాయని జోస్యం చెప్పారు. కాకినాడ, నెల్లూరు, కడప ఇలా అనేక ఇతర జిల్లాలలో అనేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా అపారమైన అవకాశాలను ఏపీ అందిస్తుందన్నారు.              


కోకో ఉత్పత్తిలో 70% ఆంధ్రప్రదేశ్ నుండి వస్తోందని, ఏపీ కేవలం రైస్ బౌల్ మాత్రమే కాదు, ఇది దేశంలోనే పెద్ద చాక్లెట్ బౌల్ అని, అరటిపండ్లు, ఆహారం, సుగంధ ద్రవ్యాలు, టమాటా ప్రాసెసింగ్‌ కోసం ఏపీలో నాలుగు మెగా యూనిట్లు రానున్నాయని అలాగే ఏపీ అతిపెద్ద పల్ప్ ఎగుమతిదారు, ఎక్కువ పల్ప్ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి వస్తుందని  ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు తెలిాపుర.  ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ వైస్ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి సహా అనేక మంది పాల్గొని  ఏపీ రాష్ట్రంలో పారిశ్రామిక విధానం,అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు.           


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సారి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించాలన్న లక్ష్యంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రధాన పారిశ్రామికవేత్తలందరికీ ఆహ్వానం పంపారు.