AM/NS Company Investment In AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్ల వ్యయంతో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు AM/NS (ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్) సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ ట్వీట్ చేసింది. ఈ రెండు సంస్థలు జాయింట్ వెంచర్‌గా 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లాలో ప్రారంభిస్తాయని పేర్కొంది. ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) జూమ్ కాల్‌లో మాట్లాడగా.. ఈ ఒప్పందం కుదిరినట్లు ట్వీట్ చేసింది. జూమ్ కాల్‌లో ఒక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మారిపోనుందని పేర్కొంది. 'AM/NS ఇండియా భారతదేశంలోని ఉక్కు విభాగంలో ఒక పరిశ్రమ దిగ్గజం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ అయిన ఆర్సెలోర్ మిట్టల్, జపాన్‌లోని ప్రముఖ ఉక్కు కంపెనీ అయిన నిప్పాన్ స్టీల్ సంయుక్త వెంచర్. ఆర్సెలోర్ మిట్టాల్ అమెరికా, యూరోప్, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో.. 60 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించింది.' అని తెలిపింది. కాగా, ఉక్కు దిగ్గజాల అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి. ఈ ప్లాంట్ గుజరాత్ హజీరా ప్లాంట్ కంటే పెద్దదని తెలుస్తోంది.
2 దశల్లో పెట్టుబడి
ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో బ్లాస్ట్ ఫర్నేస్ స్టీల్ ప్లాంట్‌ను నక్కపల్లిలో ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో సంస్థ 2,600 ఎకరాల భూమిని కోరినట్లు తెలుస్తోంది. అటు, రెండో దశలో రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెంచనున్నారు. ఇందు కోసం సంస్థ అదనంగా 2 వేల ఎకరాల భూమిని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పక్కన దాదాపు 1800 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. దీన్ని పరిశీలించాలని ప్రభుత్వ వర్గాలు కంపెనీ ప్రతినిధులకు సూచించినట్లు సమాచారం.
85 వేల మందికి ఉపాధి
అంతా అనుకున్నట్లు జరిగితే 2029 నాటికి స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం మాత్రం అంతకంటే ముందుగానే ఉత్పత్తి ప్రారంభించాలని కోరుతోంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఒడిశా, ఛత్తీస్ గఢ్ నుంచి ముడి ఖనిజాన్ని పైపులైన్ల ద్వారా ఇక్కడకు తీసుకొచ్చి స్టీల్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా, ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే మంత్రి నారా లోకేశ్ పెట్టుబడులను తీసుకొచ్చేలా శ్రమిస్తున్నారు.