Tapping the Phones of the opposition leaders in AP : ఏపి లో ప్రతిపక్ష నేతల ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. కొందరు ఐపిఎస్ లు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపి సీఈఓ కి ఫిర్యాదు చేశామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నేతల పై నమోదు చేసిన కేసులు వివరాలు ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని.. ఈ అంశం లో డీజిపి పక్షపాత వైఖరి తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపైనా సీఈఓ కు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేలా సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్నారు
పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఈసీ (EC) ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బొండా ఉమ ఆరోపిస్తున్నారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా రిశాంత్ రెడ్డి అనే అధికారి చూస్తున్నారని బోండా ఉమ తెలిపారు. పోలీస్ అధికారి కొల్లి రఘురామ రెడ్డి లక్ష్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలోనే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి ధ్రువీకరించారని బోండా ఉమ తెలిపారు. ఐపీఎస్ రూల్స్ కి బదులు వైఎస్సార్‌సీపీ రూల్స్‌ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరిని వెంటనే తొలగించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఎస్ఐబీ డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావు పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడినట్లగా తేలింది. నిబంధనల ప్రకారం ఎవరైనా దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్టుగా అనుమానాలుంటే కేంద్ర హోం శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని మాత్రమే వారి ఫోన్లను ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తాను వేర్వేరు పార్టీలకు చెందిన కీలక నాయకులు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాప్ చేశానని ప్రణీత్‌రావు విచారణలో అంగీకరించినట్టుగా తెలిసింది. సర్వర్ల సహాయం లేకుండానే ఫోన్లను ట్యాప్ చేయగల ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను విదేశాల నుంచి తెప్పించి తన ఆఫీస్‌లోని కంప్యూటర్లలో అమర్చినట్టుగా ప్రణీత్‌రావు వెల్లడించినట్టు సమాచారం.
ఎన్నికల సమయంలో ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న సమాచారంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఎక్కడైనా డబ్బు తరలిస్తూంటే.. వెంటనే పట్టేసుకున్నారు. ఈ తరహాలోనే ఏపీలోనూ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదులపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.