చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలుపుతూ టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల పూజలు సైతం జరుగుతున్నాయి. తాజాగా భద్రాచలంలో కూడా చంద్రబాబు జైలు నుంచి బయటికి రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు, యాగాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రబాబు పేరుతో సుదర్శన హోమాన్ని తెలుగుదేశం నాయకులు భద్రాచలంలో నిర్వహించారు. జాతక, గోచార రీత్యా చంద్రబాబు బాగుండాలని, ఆయన కుటుంబం సుభిక్షంగా ఉండాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, అగ్నిప్రతిష్ట, హోమం, ప్రసాద నివేదన జరిపారు. 


బీదర్ లోనూ పూజలు
మరోవైపు, చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించాలని కోరుతూ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మంగళవారం జల నరసింహస్వామికి పూజలు చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో గుహలో ఉండే జల నరసింహస్వామి ఆలయంలో పూజలు జరిగాయి. ఇక్కడ భక్తులు అర కిలోమీటరు దూరం భుజం వరకు నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రజాబలం, దైవానుగ్రహంతో చంద్రబాబునాయుడు తప్పుడు కేసుల నుంచి బయట పడి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని వారు అన్నారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన జన నేతపై అక్రమ కేసులు పెట్టి, రిమాండ్‌కు తరలించడం అన్యాయమని బక్కని నర్సింహులు అన్నారు.


చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని మాజీ ఎమ్మెల్యే బి.విజయ నాగేశ్వర రెడ్డి కలుగొట్లలో దుర్గా మాత ఆలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబుకు తోడుగా ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మరక అంటని చంద్రబాబుపై బురద జల్లారని.. ఇలా చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీకి త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఓటుతోనే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు హెచ్చరించారు.