Andhra Pradesh Elections 2024: ఆయన టీడిపి లో సీనియర్ నేత. ఒకసారి మునిసిపల్ చైర్మన్ గా.. ఒకసారి ఎమ్మెల్యే గా గెలుపొందారు. మరోసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. ఆయన మరెవరో కాదు వైకుంఠం ప్రభాకర్ చౌదరి. అనంతపురం జిల్లా  అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని పేరు. అలాంటి జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ప్రభాకర్ చౌదరి ఉన్నారు. గతంలో అనంతపురం మునిసిపల్ చైర్మన్ గా.. ఎమ్మెల్యేగా గెలుపొందారు.  




2014 ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి బాగా కలిసొచ్చింది. 2019 ఎన్నికలల్లో జగన్ ఒక్క ఛాన్స్ మాత్రం బాగా పనిచేసింది. దీనితో అనంతపురం జిల్లా ఒక్కసారి గా సీన్ మారింది. అక్కడ వైసీపీ పాగా వేసింది. మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయినప్పటికీ జిల్లా టీడిపిలో క్యాడర్ అలాగే ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధినేత చంద్రబాబు నాయుడు సీట్ల కేటాయింపు ఇప్పటివరకు చేపట్టకపోవడంతో ఇటు కార్యకర్తల్లో అటు నేతల్లో టెన్సన్ నెలకొంది. టికెట్ కేటాయింపులు లేట్ అవుతున్న కొద్దీ కొత్త  నేతలు పేర్లు వస్తున్నాయి. ఓ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనంతపురం అర్బన్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటి చేస్తే నా భుజాలపై గెలిపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి.. జనసైనికులను సైతం తనవైపు తిప్పుకున్నారు. 
ప్రభాకర్ చౌదరి కి అనంతపురం అర్బన్ లో కొంచెం పాజిటివ్ వేవ్ ఉంది. ఆయన హయాంలో రోడ్లు, డ్రైనేజ్, పార్క్ లు, ఓపెన్ జిమ్ లు ఐలా చాలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా.. ఎప్పుడు ప్రజలకు, పార్టీ కార్యకర్తలుకు అందుబాటులో ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్. టిడిపి - జనసేన పార్టీలు పొత్తు లోనున్నాయి.  మరో వైపు ఎన్నికలు సమీపిస్తూడటంతో..  అనంత అర్బన్ టికెట్ ఆశిస్తున్నా నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తువస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షం జనసేన నుంచి కూడా అర్బన్ టికెట్ ఆశిస్తోంది.  


2019 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా వైసిపి నేత అనంత వెంకట్రామిరెడ్డి గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ప్రభాకర్ చౌదరి రెండేళ్ల వరకు సైలెంట్ గానే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలు ప్రజా వ్యతిరేకమని ప్రచారం చేస్తూనే.. మరోవైపు పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అనంతపురం అర్బన్ ప్రజలకు మరింత చేరువయ్యారు. సమస్యలు తెలుసుకునేందుకు పట్టణం మొత్తం పాదయాత్ర చేశారు. రాష్ట్రానికి ఇదేం కర్మ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, బస్సు యాత్ర, యువగళం పాదయాత్ర వంటి కార్యక్రమాలన్ని విజయవంతంగా నిర్వహించారు. పార్టీ అప్పగించే పనుల్ని విజయవంతంగా నిర్వహించడం ప్రభాకర్ చౌదరికి కలిసివచ్చే అంశాలు. 


అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజలు ఎక్కువగా ఉండటంతో జనసేన నేతలు అర్బన్ టికెట్ ఆశిస్తున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే తన భుజస్కందాలపై వేసుకొని పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తానంటూ ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా సీట్లు ఇంకా ప్రకటించకపోవడంతో జనసేనకే అనంతపురం అర్బన్ టికెట్ ఇస్తారని ప్రచారం చేస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే సీటు అవసరమే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలువరించేందుకు టిడిపి, జనసేన కూటమి ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజారనీయకుండా చూసుకుంటుంది. దాంట్లో భాగంగానే అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికే టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తాడని పవన్ కళ్యాణ్ కూడా గతంలో ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఈనెల 16 నుంచి అనంతపురం నగరంలో తన ప్రచార కార్యక్రమాలను సైతం చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో అనంతపురం అర్బన్ టిడిపి అభ్యర్థిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.