Adoni Chandrababu Tour : సంపద సృష్టించి.. సంక్షేమం అమలు చేసి.. పేదలను ధనవంతులను చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ధనికుల్ని చేయడమే లక్ష్యమన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పోలీసు కంట్రోల్ సర్కిల్ దగ్గర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆదోనిలో ఇసుక దొరకడం లేదు గానీ... హైదరాబాద్, బెంగళూరులో మాత్రం దొరుకుతుందని మండిపడ్డారు. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్‌కు లారీల్లో డబ్బులు చేరుతున్నాయని ఆరోపించారు. ప్రజల భూమి ఇవాళ ఉంటే రేపు ఉంటుందో లేదో నమ్మకం లేదన్నారు. ఒకే రాజధాని కావాలని ఆదోని ప్రజలు చెబుతున్న విషయం తాడేపల్లి నివాసంలో ఉన్న జగన్ , పేటీఎం బ్యాచ్ చూడాలని హితవు పలికారు.
రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు తీసేశారని విమర్శించారు. మొత్తం 150 అన్న క్యాంటీన్లను తీసేసి.. ప్రజల కడుపు కొట్టారు. తమిళనాడులో అమ్మా క్యాంటిన్ కంటిన్యూ చేస్తానని అక్కడి సీఎం స్టాలిన్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉంది. డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు. ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం జగన్‌కు తెలుసు. నాపై కేసు పెట్టేందుకు రాజశేఖర్ రెడ్డి కూడా సాహసించలేదు. ఆదోని ఎమ్మెల్యే కేసులు పెట్టి ఏం చేస్తారు. నన్నే భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజలకు తప్ప తానెవరికీ భయపడబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండుంటే.. పింఛన్లు మూడు వేలు వచ్చేవన్నారు.
ఓ వైపు అప్పులు చేస్తూ మరో వైపు రాష్ట్రంలో అన్నింటిపైనా ఛార్జీల మోత మోగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆఖరికి చెత్త పైనా పన్ను వేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలే. ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈడీ దాడులు చేస్తారనే భయంతోనే జగన్ వైన్ షాప్‌ల్లో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయన్నారు. నిరుద్యోగులకు తాను ఐటీ ఆయుధాన్ని ఇచ్చా. విద్యా విప్లవం తీసుకొచ్చాను. ఆడ పిల్లలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు
సంపద సృష్టించే పార్టీ తెదేపా. వైకాపా పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు లేవు. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. కూలీ పనులు చేసే పిల్లలకు ఐటీ ఉద్యోగాలు ఇచ్చాను. జగన్‌రె మాత్రం మటన్ కొట్టులో ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు సెటైర్ వేశారు. విద్యార్థులను గంజాయి మత్తులో దించుతున్నారు. డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు. ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం జగన్‌కు తెలుసు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధం. నిండు మనసుతో ఆశీర్వాదించి గెలుపు ఇస్తే రుణం తీర్చుకుంటానని చద్రబాబు హామీ ఇచ్చారు.