Just In





Ajay Banga TDP : ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా - టీడీపీ నేతల సంతోషం ! ఎందుకంటే ?
ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎంపిక కావడం పట్ల టీడీపీ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే?

Ajay Banga TDP : భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఒక భారతీయ అమెరికన్, సిక్కు అమెరికన్ ప్రపంచ బ్యాంక్‌కు సారథ్యం వహించడం చరిత్రలో ఇదే ప్రథమం. మే 2వ తేదీన బంగా ప్రపంచ బ్యాంక్ సారథిగా పగ్గాలు చేపడతారు. అప్పటి నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సమావేశమై అజయ్ బంగాను అత్యున్నత పదవికి ఎంపిక చేశారు. చరిత్రలో అత్యంత కీలకమైన ఈ సమయంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హుడుగా భావించిన బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు.
సంప్రదాయికంగా ప్రపంచ బ్యాంక్ సారథ్యం అమెరికన్లకే దక్కుతోంది. తమ తరఫున ఆ పదవికి బంగా పేరును ప్రతిపాదించనున్నట్టు బైడెన్ ఫిబ్రవరిలోనే ప్రకటించారు. గతంలో మాస్టర్ కార్డ్ ఇంక్ చీఫ్‌గా వ్యవహరించిన బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న 300 పైగా పెద్ద అంతర్జాతీయ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్‌గాను, ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్‌గాను కూడా బంగా పని చేశారు. మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన బంగా పాఠశాల విద్యను సిమ్లాతో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అభ్యసించారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక కావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు గర్వకారణం అన్నారు.
అజయ్ బంగా మాస్టర్ కార్డ్ సీఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు ఓ సారి కలశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఫిన్ టెక్ జోన్‌లో మాస్టర్ కార్డు కార్యాలయాన్ని పెట్టాలని కోరారు.దానికి అజయ్ బంగా అంగీకరించారు. ఏపీ ప్రభుత్వంతో కొన్ని ఎవోయూలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్ సర్కార్ వాటిని పట్టించుకోలేదు. దాంతో మాస్టర్ కార్డు కార్యాలయం ఏపీకి రాలేదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
అలాగే సీఐఐ సమ్మిట్ లో చంద్రబాబు పని తనం గురించి బంగా చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ పొగిడినట్లే బంగా కూడా చంద్రబాబును పొగిడారు.