Guntur News : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ వర్గాల పోరుతో సతమతమవుతోంది. మొదటి నుంచి ఎంఎల్ఏ, మేయర్ మద్య వివాదం కొనసాగుతుంది...తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఎంఎల్ఏ గుర్రుగా ఉన్నారు. తన హోదాను తగ్గించి కార్పొరేషన్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని మేయర్ ఆగ్రహంతో ఉన్నారు. తమకు అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత మంది కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. మేయరు తమ మాటకు ప్రాధాన్యత ఇవ్వ కుండా అగౌర పరుస్తున్నారని వారంటున్నారు. మొత్తంగా పదమూడు మంది అసంతృప్త కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. వీరందరూ ఎమ్మెల్యే ముస్తఫా వర్గానికి చెందిన వారు.
అయితే మేయర్ అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మేయర్ వర్గీయులు ఉంటున్నారు.. రాష్ట్రంలోనే నివాస యోగ్యత సూచీలో ప్రధమ స్థానం లో ఉన్న గుంటూరు నగరం పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేందుకే కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేయర్ మనోహర్ నాయుడు వర్గీయులు. గుంటూరు మేయర్, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మధ్య సఖ్యత లేదు. జీఎంసీలో మొత్తం యాభై ఏడు మంది సభ్యులు ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది టీడీపీ కి చెందిన వారు కాగా జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన కావటి మనోహర్ నాయుడికి ఇచ్చారు.
అయితే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాత్రం వైశ్య ప్రముఖుడు పాదర్తి రమేష్ గాంధీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. చివరికి చెరో రెండున్నరేళ్లు అన్నట్లుగా రాజీ చేసి మేయర్ పదవిని హైకమాండ్ మొదట మనోహర్ నాయుడుకు అప్పగించింది. కానీ కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారానికి ముందే రమేష్ గాంధీ చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నకలో టిడిపి అభ్యర్ధి విజయం సాధించారు. అప్పటి నుండి మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే ముస్థఫా మధ్య పొసగటం లేదు. తమ వర్గానికి చెందిన కార్పొరేటర్లకు పనులు చేయడం లేదని తాము చెప్పిన ప్రతిపాదనలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే వర్గం మండిపడుతోంది.
స్టాండింగ్ కమీటిల్లో తమకు ప్రాధాన్యనివ్వటం లేదని కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రమే పిలుస్తున్నారని ముుస్తఫా వర్గం సభ్యులు వాపోయారు. అంతే కాకుండా గతంలో జరిగిన పదవి పంపిణీ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో ఇదంతా ఎమ్మెల్యేనే చేయిస్తున్నాడని మేయర్ వర్గం భావిస్తుంది. గుంటూరు పరిధిలో వైసిపిలో బహుళ నాయకత్వం ఉంది. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసురత్నం ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ముస్థఫా, మేయర్ కావటి మనోహర్ వీరందరూ కారొరేషన్ పరిధిలోనే ఉంటారు. అయితే మేయర్ పై అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే ముస్థఫా తనదైన శైలిలో ఆరోపణలు గుప్పస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయనను పదవి నుంచి దించడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.