ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులుగా అవినీతి నిరోధక శాఖ జరుపుతున్న తనిఖీలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు అవినీతి అధికారుల ఆస్తుల వివరాలు రాబట్టిన అధికారులు మరికొందరి భరతంపట్టే పనిలో ఉన్నారు. 


దుర్గగుడిలో అవినీతి ఉద్యోగి
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సూపరింటెండెంట్ వాసా నగేష్‌ నివాసం, ఆఫీస్‌పై ఏసీబీ రైడ్ చేసింది. ఆయన ఇంట్లో సోదాలు వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరంలోని కుమ్మరిపాలెంలోని, లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నంబర్ ఎఫ్-34లోని నివాసంతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మరో 6 చోట్ల (భీమడోలు, ద్వారకా తిరుమల, నిడదవోలు) ఆస్తులు పరిశీలిస్తున్నారు. నగేష్ కార్యాలయంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
వాసా నగేష్ వద్ద గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవే
ఇంట్లో 1. 17.91 లక్షల నగదు, 209.10 గ్రాముల బంగారం
ద్వారకా తిరుమలలో G+4 ఇల్లు,
జంగారెడ్డిగూడెంలో ఇల్లు, 
నిడదవోలో ఇల్లు, ఇంటి స్థలం,
సుజుకి వ్యాగన్ కారు, 
రెండు యాక్టివా స్కూటర్లు,
ద్వారకా తిరుమల యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఒక లాకర్‌, బ్యాంక్ ఖాతాలు


మూడు రోజుల నుంచి కలకలం
వరుసగా మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన ఉద్యోగులను టార్గెట్ చేయటం చర్చనీయాశంగా మారింది. ఇప్పటికే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌తో పాటు కోపరేటివ్ బ్యాంక్ అధికారిపై కూడా దాడులు జరిగాయి. వారి ఆస్తులు ఇంకా లెక్కిస్తున్నారు. అవినీతి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తున్న అజ్జా రాఘవరావు కార్యాలయం, నివాసంలో సోదాలు చేశారు. ఆయన అక్రమముగా స్థిర, చరాస్తులు ఆర్జించారని, సమాచారం అందటంతో ఏకకాలంలో దాడులకు దిగారు. నివాసం, కార్యాలయంతోపాటు 4 ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. 


కర్నూలులో కూడా
కర్నూలు జిల్లాలోని డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్- రిజిస్ట్రార్ సుజాత ఇల్లు, కార్యాలయం, ఆమె బంధువులపై ఇళ్లపై రైడ్ చేశారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రకటించారు. కర్నూలులోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు, అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు ఉంది.  కస్తూరి నగర్ కాలనీలో ఇల్లు, బుధవారిపేటలో G+1 దుకాణంతో కూడిన ఇల్లు గుర్తించారు. బుధవారిపేటలో మరో దుకాణం, సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కర్నూలు శివారు ప్రాంతంలో రూ.23,16,000 విలువైన ఎనిమిది ఇళ్ల స్థలాలు గుర్తించారు. 40 తులాల బంగారం, ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒక టూవీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం, గృహోపకరణాలు రూ. 8,21,000/- నగదు సీజ్ చేశారు.