Chandrababu As Fourth Term CM Of Andhrapradesh: చంద్రబాబు.. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది ఓ విజన్. ఓ నాయకుడిగా దూరదృష్టితో ఎప్పుడూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా నిరంతరం పరితపిస్తూ శ్రమిస్తుంటారు. ఉమ్మడి ఏపీలో ఆయన చొరవతో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కింది. నేడు ప్రపంచ దేశాలు ఐటీ అంటేనే హైదరాబాద్ వైపు చూస్తున్నాయంటే ఆయన విజనే కారణం. ఎక్కువగా సంపద సృష్టిపైనే దృష్టి కేంద్రీకరించి యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చంద్రబాబు (Chandrababu) పాలన సాగుతుంది. కేవలం ఐటీ అనే కాదు విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన పాలనతో ఓ చెరగని ముద్ర వేశారు. నధుల అనుసంధానం చేసి సాగునీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. కోనసీమ తుపాను, హుద్ హుద్, తిత్లీ వంటి పెను విపత్తుల సమయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా వ్యవహరించారు. అటు, పాలనలోనే కాదు ఇటు రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు, ఎక్కువసార్లు సీఎంగా పని చేసిన నేతగా రికార్డులకెక్కారు. 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి బుధవారం ఉదయం నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
సుదీర్ఘ ప్రయాణంలో..
రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబే. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడుదొడుకులు, గెలుపు, ఓటమి, పదవులు, అవమానాలు అన్నింటినీ చూశారు. గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా.. విమర్శలను తట్టుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ టీడీపీని ముందుండి నడిపించారు. ఆయన రాజకీయ ప్రయాణం ఓసారి చూస్తే..
- సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు చిన్నతనం నుంచే గ్రామీణ ప్రాంత పేదల ఇబ్బందులు కళ్లారా చూశారు. చదువుకునే రోజుల్లోనే 1975లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
- 1978లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1980లో సీఎం టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేశారు.
- 1983లో ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. 1986లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా.. 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు.
- సీనియర్ ఎన్టీఆర్ నుంచి టీడీపీ పగ్గాలు చేపట్టిన ఆయన 1995 సెప్టెంబర్ 1న ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 1998లో హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైటెక్ సిటీ ప్రారంభించారు.
- 1996 యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నారు. 1999లో జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. 1999లోనే రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఏపీలో ఎక్కువ కాలం సీఎంగా సేవలందించిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఏపీలో 2004 - 2014 వరకూ పదేళ్లు ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు.
- విభజన తర్వాత 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో అమరావతిని రాజధానిగా చేసి పాలన సాగించారు. రాజధాని అభివృద్ధి కోసం కృషి చేశారు.
- 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2024లో నవ్యాంధ్రకు రెండోసారి.. మొత్తంగా నాలుగోసారి సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టారు.
పడి లేచిన కెరటం
2019లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీ నేతలు ఆయన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారు. స్కిల్ స్కాం పేరిట ఆయన్ను జైలుకు కూడా పంపించారు. అవన్నీ తట్టుకుని నిలబడ్డారు. తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఆయనకు అండగా నిలిచారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమితో పక్కా ప్రణాళికతో గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు సమాయత్తం అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో 2024 ఎన్నికల్లో కూటమికి 164 స్థానాల్లో విజయం కట్టబెట్టి ఏపీ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. వైసీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. అటు, 16 ఎంపీ స్థానాల్లో గెలిచి కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఘనతలు.. ముందున్న సవాళ్లు
విభజనతో తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమించారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమకు సాగునీరు అందేలా చేశారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతానికి పైగా పూర్తి చేశారు. కియా వంటి పరిశ్రమలతో రూ.వేల కోట్లు పెట్టుబడులు వచ్చేలా చేశారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని నెం.1గా నిలిపారు. 2019లో ఓటమిపాలై ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టిన క్రమంలో మళ్లీ ఆయన ముందు భారీ సవాళ్లే ఉన్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా పేరొందిన ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు.. అమరావతి నిర్మాణం, పరిశ్రమలు తీసుకురావడం, అధిక పెట్టుబడులు వచ్చేలా చేయడం, యువతకు ఉపాధి కల్పన, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, ఆర్థిక వ్యవస్థను మళ్లీ మెరుగుపరచడం వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి.