Chandrababu Comments on CM Jagan in Tiruvuru: సీఎం జగన్ (CM Jagan) దుర్మార్గపు పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో (Tiruvuru) ఆదివారం నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నాతో సహా ప్రజలందరూ బాధితులేనని అన్నారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. ఇక్కడ అమరావతి వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం జగన్ రివర్స్ పాలనే అని ప్రజలు గుర్తించాలని చెప్పారు. 'ఓ వ్యక్తి వల్ల ఓ రాష్ట్రం.. ఓ తరం ఇంతలా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓ అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు, అదే ఓ దుర్మార్గుడికి అధికారం అప్పగిస్తే తిరిగి కోలుకోలేని స్థితిలో నష్టపోతాం. ప్రజాస్వామ్యంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ అరాచక పాలనకు చరమ గీతం పాడాలి.' అని పిలుపునిచ్చారు. 






అమరావతే రాజధాని 


టీడీపీ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని (Amaravathi) ప్రకటించినప్పుడు, సీఎం జగన్ మద్దతు పలికారని.. ఇప్పుడు 3 రాజధానులంటూ మాట మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. స్వయంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చి అమరావతికి ఫౌండేషన్ వేశారని.. ఇప్పుడు రాజధాని ఏదీ అంటే చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని మండిపడ్డారు. రుషికొండను బోడిగుండును చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని.. అసలు జగన్ కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా.? అని ప్రశ్నించారు. టమాటొకి.. పొటాటోకి తేడా తెలియని వ్యక్తి మన సీఎం అని ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి నుంచి ప్రజలు ఇంకే ఆశిస్తారని.? అన్నారు. ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. 


'మహిళలకు ఫ్రీ బస్ జర్నీ'


రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలందరికీ 'మహాలక్ష్మి' పథకం కింద నెలకు రూ.1500 అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, తల్లికి వందనం కింద రూ.15 వేలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీయేనని.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వంద పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట' సూపర్ సిక్స్ అందిస్తామని అన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తామని.. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 'జయహో బీసీ' కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 'అన్నదాత' కింద రైతులకు రూ.20 వేలు అందజేస్తామన్నారు. త్వరలోనే టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.


వైసీపీ ఇంఛార్జీల మార్పుపై


ఇటీవల వైసీపీ ఇంచార్జీల మార్పుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 'సొంత పార్టీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ నమ్మడం లేదు. ఆయన్ను ప్రజలు నమ్మడం లేదు.' అంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఎమ్మెల్యేలను బదిలీ చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. 'ఎమ్మెల్యేలను మారిస్తే ఓట్లు పడతాయా.? మనింట్లో చెత్త తీసుకెళ్లి పక్కింట్లో వేస్తే అది బంగారం అవుతుందా.?' అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసిన వారికి వైసీపీ సీట్లు ఇవ్వడం లేదని అన్నారు. నన్ను, లోకేశ్, పవన్ ను దూషిస్తేనే టికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు ఎంపీ టికెట్ పేరుతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడును మోసగించారని, ఆ టికెట్ మరొకరికి ఇవ్వడంతో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించారని అన్నారు. ఈ విషయాలు ప్రజలు గమనించాలని సూచించారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. 


Also Read: Raghurama Krishna Raju: ఆరు రోజుల్లోనే అంబటి రాయుడికి జ్ఞానోదయం! రఘురామ అభినందనలు